12-04-2025 11:46:58 PM
- మర్రి జనార్దన్ రెడ్డి 2.0 చూస్తారు.!
- ఓటమి తర్వాతే గుణపాఠం నేర్చుకున్నా.
- మనోడెవరో పగోడెవరో తెలిసింది.
- గ్రామాల్లో దిమ్మెలకు రంగులేయండి గులాబీ జెండాలెగరేయండి.
- బిఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది.
- ఖర్చులు నేనే భరిస్తానని చెప్పా..
- వరంగల్ సభలో కందనూలు పేరు మొగాలి.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కొంతమంది కార్యకర్తల పట్ల అతి విశ్వాసంతోనే తాను ఓటమి చెందిన విషయాన్ని గ్రహించినట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రజలు తనను ఓడించి తప్పు చేశారని అలక చెందడంతో తానే మరింత నష్టపోతున్నట్లు గ్రహించానని ఇకనుంచి ప్రతి గడపను తాకుతూ వారందించే కలోగంజో తాగి వారి సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ సభ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తనను మర్రి జనార్దన్ రెడ్డిగా మాత్రమే చూశారని ఇకనుంచి మర్రి 2.0 చూస్తారని అన్నారు. తన ఓటమికి కారణం ఎవరో తెలిసిందని పగోడెవరో మనోడెవరో తెలుసుకొని పార్టీ కోసం తన కోసం పనిచేసిన వారి పేర్లు డైరీలో రాసుకుంటున్నట్లు తెలిపారు.
వాటి ఆధారంగానే వారిని గుర్తించి వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తాను ఓటమి తర్వాత కార్యకర్తల పట్ల అలక చెందిన మాట వాస్తవమేనని దానివల్ల తానే మరింత నష్టపోతున్నట్లు గ్రహించినట్లు తెలిపారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ తీవ్ర నష్టాల్లో ఉందని అందులో భాగంగానే రజతోత్సవ వేడుకల్లో నియోజకవర్గానికి డబ్బులు పంపించినా వాటికి మరింత జోడించి తాను పార్టీ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నియోజకవర్గానికి 25 బస్సులను ఏర్పాటు చేసిందని మరో 75 క్రూజర్లు, కారు అందుబాటులో ఉన్న కార్యకర్త పేర్లు తనకు రాసివ్వాలని వారి డీజిల్ ఖర్చులు కూడా తానే భరిస్తానని తెలిపారు. గ్రామాలలో పార్టీ దిమ్మెలకు రంగులు వేసి తాను ఇచ్చే జెండాను ఎగరేయాలని ఈనెల 27న వరంగల్లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ సభలో కందనోలు గురించి చెప్పుకునేలా పార్టీ కార్యకర్తలు సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యదర్శికి తీవ్ర అవమానం..!
పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందస్తు నియోజకవర్గ విస్తృత సాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకానీ శ్రీనివాస్ యాదవ్ ను వేదిక మీదికి పిలవకుండా ఏర్పాటు చేసిన బ్యానర్ పై కూడా తన ఫోటో లేకుండా ఘోరంగా అవమానించారు. మండల కార్యకర్తలను మండల నాయకులను సభలో కూర్చోబెట్టడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. బిసి నాయకుడు పార్టీ కోసం ఉద్యమంలో ఎంతగానో పనిచేసిన ఆయనకు అవమానం జరగడం పట్ల ఆయా బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు.