calender_icon.png 30 September, 2024 | 6:10 AM

ఎన్నికల బిజీలోనూ బిజినెస్ వదలట్లే!

28-09-2024 01:48:09 AM

ప్రచారంలో ట్రంప్ డైమండ్ వాచుల వ్యాపారం

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలను సైతం తన బిజినెస్ కోసం వాడుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా విలువైన వస్తువులను విక్రయిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రంప్ రాజకీయాల్లోకి ప్రవేశించి అధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఎన్నికల్లో బిజీగా ఉంటూనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రచార ర్యాలీలో భాగంగా ఆయన బైబిల్స్, స్నీకర్స్, ఫొటో బుక్స్, క్రిప్టో కరెన్సీ విక్రయించగా, తాజాగా వజ్రాలు పొదిగిన గడియారాల వ్యాపారంలోకి ట్రంప్ దిగుతున్నారు. గురువారం ట్రంప్ వాచ్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు. వాటిలో అత్యంత ఖరీదైన 122 డైమండ్లు పొదిగిన, 18 క్యారట్ల గోల్డ్ స్టుల్ వాచ్ కూడా ఉంది.

దీని ధర ఏకంగా రూ.83 లక్షలు (లక్ష డాలర్లు) ఉంటుందని సమాచారం. ఈ వారం ప్రారంభంలో ట్రంప్ తన ఫొటోను ముద్రించిన 100 వెండి నాణేలను విక్రయించినట్లు ప్రకటించారు. 59.99 డాలర్లు ఖర్చు పెట్టి గాడ్ బ్లెస్ ది యూఎస్ బైబిల్‌ను  కొనుగోలు చేయాలని తన మద్దతుదారులను కోరారు.