విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ముక్కోణపు క్రైమ్ కథలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్లకు తెర తీశారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్‌గా ‘గోదారి గట్టు’ సాంగ్‌ను విడుదల చేశారు. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా అలరించిన రొమాంటిక్ ట్రాక్ ఇది. ‘గోదారి గుట్టు మీద రామసిలకవే.. గోరింటాకెట్టుకున్న సందమామవే.. ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే.. ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే..’ అని బతిమాలుకునే శ్రీవారిని, ‘గోదారి గుట్టు మీద రామసిలకనే.. గీపెట్టి గింజుకున్నా నీకు దొరకనే..’ అని వారించే శ్రీమతిని ఇందులో చూడొచ్చు.
ఈ గీతంలో భార్యాభర్తలుగా వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్‌ల కెమిస్ట్రీ పండింది. భాస్కరభట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదాలను అందంగా ఆవిష్కరిస్తోంది. జానపదం బాణీలో సాగుతున్న ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. రమణ గోగుల గాత్రం ఈ యూనిక్ స్టుల్ మెలోడీకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. మధుప్రియ మెస్మరైజ్డ్ వాయిస్‌ను కూడా ఈ గీతంలో వినవచ్చు. ఈ సినిమా 2025, జనవరి 14న విడుదల కానుంది.