- కొత్త ఎక్సైజ్ పాలసీకి రూపకల్పనకు ఆమోదం
- ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నవారు సైతం పోటీ చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ర్ట సచివాలయం మొదటి బ్లాకులోని సమావేశ మందిరంలో బుధవారం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు ఆమోదముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నిబంధనను రద్దు చేస్తామంటూ ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపు
మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను రద్దు చేసింది. అలాగే మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్ల విషయంపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. వాటిపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీసర్వే ప్రక్రియను నిలుపుదలలో పెట్టాలని కూడా నిర్ణయించింది. ఫేజ్‌ధి కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టుల భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు పలు అంశాలపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు.
కొత్త మద్యం పాలసీ
ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని తొలగించి నూతన విధానాన్ని రూపొందిం చేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్‌లో జరిగిన అవకతవకలపై మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చజరిగింది. ముఖ్యంగా 2014-15 2019 ప్రభుత్వాల్లో ఎ క్సైజ్ పాలసీలపై క్యాబినెట్‌లో చర్చించారు. దోపిడీకే ఎక్సైజ్ పాలసీని గత ప్రభుత్వం రూపొందించిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్ మెంట్ పాలసీలోనూ మార్పులు తీసుకురావాలని సూచించింది.