calender_icon.png 4 January, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క జాబ్ ఇచ్చినా రాజకీయాలు వదిలేస్త

01-08-2024 02:25:22 AM

  1. నోటిఫికేషన్లే ఇవ్వకుండా ఉద్యోగాలెలా ఇచ్చారు?
  2. మాపై కోపంతో పాత పథకాలను నిలిపేయొద్దు
  3. నిధుల కోసం మీరు నిద్రపోవవడం లేదు..
  4. మమ్మల్నీ పోనివ్వడం లేదు
  5. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 

హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్లు ఇచ్చారని చెప్పారు.

అశోక్‌నగర్‌కు వెళ్లి అక్కడి యువతను అడుగుదామని, ఒక్క ఉద్యోగమైనా రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చిందని వారు చెబితే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. లక్షమందితో సీఎంకు పౌర సన్మానం కూడా చేస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జలసీ తప్ప, ఒక్క పాలసీ లేదని విమర్శించారు.

పదేళ్లు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చొబెట్టారని తెలిపారు. ఆస్తులతో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ అని ప్రచారం చేయటం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సొంత కాళ్ల మీద నిలబడే రాష్ట్రాన్ని తాము కాంగ్రెస్‌కు అప్పగించామని చెప్పారు. ‘రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధులు తెచ్చేందుకు కాంగ్రెస్ మంత్రులు, సీఎం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని నాకు తెలుసు. ఈ క్రమంలో మీరు నిద్రపోవడం లేదు.. మమ్మల్నీ పోనివ్వడం లేదు’ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌కు కేసీఆర్ ఫోబియా.. 

కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పినందుకు అభినందించాలా? చాంతాడంత హామీలిచ్చి.. రవ్వంత కేటాయింపులు చేశారు. విద్య భరోసా, రైతు భరోసా, తులం బంగారానికి బడ్జెట్‌లో నిధులు ఎందుకు ఇవ్వలేదు? రోజుకో లీకుతో హామీల అంశం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు దేశంలోనే అత్యల్పమని కేంద్రమే చెప్పింది. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి. కాంగ్రెస్ వచ్చాక 388 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పదేళ్లుగా లేని నీటి కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి?’ అని నిలదీశారు. 

మాపై కోపంతో ప్రజలను కష్టపెట్టొద్దు

బీఆర్‌ఎస్‌పై కోపంతో ప్రజలకు నష్టం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ‘ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని అనండి. కానీ పథకాలను రద్దు చేసి, ప్రజలకు అన్యాయం చేయొద్దు. ఫసల్ బీమా యోజనలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాతే చేరలేదు. తెలంగాణ ఎందుకు చేరినట్లు? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేల పింఛన్ వెంటనే పంపిణీ చేయాలి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు 15 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

బతుకుమ్మ చీరలకు మరొక పేరు పెట్టి అమలు చేయండి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రోరైల్ పొడిగింపును పునః పరిశీలించాలి. ఫార్మాసిటీ రద్దు నిర్ణయాన్ని కూడా పునః పరిశీలించాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే. కానీ ఆటోడ్రైవర్లకు కూడా న్యాయం చేయాలి. ఇప్పటికే 59 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మేం రూ.16 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డిజైన్లు చేశాం. ఖర్చు ఎందుకు పెరిగిందో డీపీఆర్‌ను సిద్ధం చేయాలి’ అని డిమాండ్ చేశారు.

రేవంత్ నాకు మంచి దోస్త్

సీఎం రేవంత్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్లుగా తెలుసని కేటీఆర్ తెలిపారు. సభలో సీఎంను కేటీఆర్ ఏకవచనంతో సంభోదించటంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలుపగా.. కేటీఆర్ పై విధంగా వివరణ ఇచ్చారు. గత పదేళ్లుగానే తమ మధ్య చెడిందని, అంతకుముందు బాగానే ఉండేవాళ్లమని తెలిపారు. 

ఉచిత బస్ విజయంతో బీఆర్‌ఎస్‌కు కళ్ల మంట: మంత్రి పొన్నం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావటంతో బీఆర్‌ఎస్ నేతలకు కండ్లు మండుతున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికులకు నష్టం జరుగుతుందని బద్నాం చేయడం సరికాదని అన్నారు. మెట్రోతోపాటు, ఓలా, ఉబర్ ద్వారా ఏం నష్టం జరగడం లేదా? అని నిలదీశారు. కొందరు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళా ప్రయాణికులను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు 70 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని వెల్లడించారు. 

అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ దిట్ట: సీతక్క

అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ దిట్ట అని మంత్రి సీతక్క విమర్శించారు. ఉద్యోగాలపై కేటీఆర్ చేసిన విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లలో ఎవరికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగాలపై కేటీఆర్ మాట్లాడితే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. తమ పాలనలో ప్రజలు సంతృప్తిగా  ఉండటంతో బీఆర్‌ఎస్ నాయకులకు బాధ కలుగుతుందని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీ కచ్చితంగా అమలు చేసి తీరుతామని తెలిపారు. పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నవారి నుంచి రికవరీలు చేస్తున్న మాట వాస్తవమేనని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్‌లు కూడా పెన్షన్ తీసుకున్నారని విమర్శించారు. 

మూసీ కోసం ఎంతైనా ఇవ్వండి: కోమటిరెడ్డి

మూసీ సుందరీకరణకు అంచనాలను ఎందుకు పెంచాలని కేటీఆర్ ప్రశ్నించటంతో మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చారు. దానిపై ఎలాంటి డీపీఆర్ రూపొందచలేదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, సుందరీకరణ కోసం ఎంత వెచ్చించినా.. ప్రతిపక్షం సహకరించాలని కోరారు.