మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, నవంబర్ 21: ముంబైపై దాడి ఘటనలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా మనదేశంలో న్యాయబద్ధంగానే జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జమ్ముకశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై అపెక్స్ కోర్టు గురువారం విచారణ జరిపింది.
పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాలిక్‌ను వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలపై గతంలో సుప్రీం స్టే విధించింది. ఈ సందర్భంగా మాలిక్ నేర చరిత్రను దృష్టిలో ఉంచుకొని భద్రతా కారణాల రీత్యా వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వాలని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
ఈ సందర్భంగా కోర్టుకు తీసుకెళ్లకపోతే వీడియో కాన్ఫరెన్స్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలమని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఉగ్రవాది కసబ్‌కు కూడా పారదర్శక విచారణ ఎదుర్కొనేలా అవకాశాలు కల్పించామని పేర్కొన్నది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.