calender_icon.png 20 April, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరాష్ట్రం సిద్ధించినా..కేసులు వదలట్లే!

20-04-2025 12:00:00 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏండ్ల తరబడి ఉద్యమ బాటలో నడిచి అనేక సంఘటనల్లో కేసులపాలై.. చివరికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు దాటుతున్నా కేసుల నుంచి తమకు విముక్తి లభించడం లేదని తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2011లో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మణుగూరు ప్యాసింజర్ దగ్ధం ఘటన కేసులో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బట్టు శ్రీనివాస్, మాందాటి ఏకాంబరం, వేల్పుల రేవంత్, చిలుకూరి కరుణాకర్, కొంతం సూర్యనారాయణ, శివారపు శ్రీధర్, ఠాగూర్ సతీష్, నర్సింగం యాదగిరి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

2011 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వగా కేసముద్రం - తాళ్లపూస పల్లి రైల్వే స్టేషన్ల మధ్య మణుగూరు ప్యాసింజర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో కేసముద్రం మండలానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అలాగే ఆ ఎనిమిది మందిపై సెల్ టవర్ల పై నిరసన, కేసముద్రం మండల కేంద్రంలో పొట్టి శ్రీరాములు విగ్రహ ధ్వంసం, ఆర్టీసీ బస్సుల ధ్వంసం, రాస్తారోకోలు, కేసముద్రం రైల్వే స్టేషన్ ధ్వంసం తదితర ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేశారు.

ఇలా ఒక్కొక్కరిపై పది నుంచి 60 వరకు బైండోవర్ కేసులు, ఇతర కేసులు, రౌడీ షీట్లు నమోదయ్యాయి. ఉద్యమ సమయంలో ఎక్కడ ఏం జరిగినా వీరినే బాధ్యులను చేయడం అప్పట్లో నిత్య కృత్యంగా మారింది. అయితే స్వరాష్ట్రం సిద్దించిన తర్వాత వీరిపై చిన్న చిన్న కేసులు తొలగించినప్పటికీ మణుగూరు ప్యాసింజర్ రైలు దహనం ఘటన కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

ఉద్యమకారులుగా పేరు ఉన్న ఎనిమిది మందిలో మాందాటి ఏకాంబరం రోడ్డు ప్రమాదంలో మరణించగా మిగిలిన ఏడుగురు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో రెక్కల కష్టం పైనే ఆధారపడ్డ వారికి 12 సంవత్సరాలుగా కేసు వాయిదా పడ్డప్పుడల్లా కోర్టుకు వెళ్లి రావడానికి .. కుటుంబ పోషణకు ఉద్యమకారులకు పెద్ద కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసముద్రం మండలంలో ఉద్యమకారులుగా గుర్తింపు పొందిన వీరిలో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కలేదని వాపోతున్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే తమ ఆకాంక్షలు నెరవేరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని భావిస్తే..  ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం దక్కకపోగా ఛీత్కారాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కేసులను కొట్టేసినప్పటికీ రైల్వే కేసు ఇప్పటికీ తొలగించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.

తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమంలో ముందుండి నడిచి, లాఠీ దెబ్బలు తిని, కేసుల పాలైనప్పటికీ పదేండ్ల తెలంగాణ పాలనలో ఏ ప్రయోజనం లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్న ట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనని వారికి అనేక విధాలుగా లబ్ధి చేకూరిందని, తమను మాత్రం ఇప్పటివరకు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉద్యమకారులు వాపోయారు. 

రైల్వే కేసులు తొలగించాలి

12 ఏళ్ల నుండి మణుగూరు ప్యాసింజర్ దగ్ధం కేసులో కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వం తమపై కేసులను ఎత్తివేస్తామంటే ఎంతో ఊరట కలిగింది. అయితే రైల్వే కేసు తొలగించకుండా అలాగే ఉంచారు.

దీనితో కేసు వాయిదా పడ్డప్పుడల్లా కోర్టుకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఇకనైనా కోర్టు కేసుల నుంచి మాకు విముక్తి కలిగించాలి.

 చిలుకూరి కర్ణాకర్ , ఉద్యమకారుడు 


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలి

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలం, కేసుల నుంచి విముక్తి, కుటుంబ పోషణ కోసం ఆర్థిక సాయం లేదంటే ఉపాధి అవకాశం కల్పించాలి. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తుందని ఎదురు చూస్తున్నాం. వెంటనే స్పందించి ఉద్యమకారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలి. 

-- వేల్పుల రేవంత్, ఉద్యమకారుడు