calender_icon.png 31 October, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెక్కలు ముక్కలైనా.. పైసలు తక్కువే

17-07-2024 06:48:14 AM

  • వెనకబడిన దేశాలకంటే ఇండియాలోనే వేతనాలు తక్కువ
  • ఏళ్లు గడుస్తున్నా మారని బతుకులు
  • మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పవన్ ఖేరా

న్యూఢిల్లీ, జూలై 16: ఎన్నో  రోజులుగా పోరాటాలు చేస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎంత కఠిన చట్టాలు వస్తున్నా కానీ కార్మికులను దోచుకుని పెత్తందార్లకు మాత్రం కళ్లెం పడడం లేదు. ఏళ్లుగా వారు దోచుకుంటూనే ఉన్నారు. మన దేశం అన్ని రంగాల్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందని పలు నివేదికలు, ప్రభుత్వాలు చెబుతున్న వేళ బయటికొచ్చిన గ్లోబల్ రిపోర్ట్ ఇండియన్ కార్మికులకు షాక్‌కు గురిచేస్తుంది. చివరికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి.. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల కన్నా మనం దిగువ స్థానంలో ఉండడం మన కార్మికుల పరిస్థితికి అద్దం పడుతోంది.

మేము అధికారంలోకి వస్తే.. కార్మికులకు కష్టాలు రాకుండా చూసుకుంటాం.. వారి పిల్లల బంగారు భవితకు బాటలు వేస్తాం అని మన నాయకులు చెప్పే మాటలు ఉత్త నీటి మూటలే అని తేలిపోయింది. ఏదో పక్షానికి కొమ్ము కాయకుండా కార్మికుల పక్షాన గొంతెత్తి నిలిచే ప్రభుత్వాలు, చట్టాలు వచ్చే వరకు మన భారతీయ కార్మికులకు న్యాయం జరగడం అనేది అమలు కాని హామీలానే మిగిలిపోనుంది. 

చట్టాలు.. కార్పొరేట్ చుట్టాలే.. 

కార్మికుల సంక్షేమం కోసం అని మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ అవన్నీ పెట్టుబడిదారులకు ఎప్పుడో చుట్టాలుగా మారిపోయాయి. ఆ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ పెత్తందార్లు కార్మికుల పొట్టకొడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, చట్టాలు ఎన్ని వచ్చినా కానీ ఈ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మన ఆర్థిక వ్యవస్థ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందని అధికారులు, నివేదికలు, రాజకీయ నాయకులు చెవులు మార్మోగేలా అరిచినా కానీ కార్మికుల కష్టాలు చూడని దేశాలు మాత్రం ఎప్పటికీ అభివృద్ధి చెందవని పలువురు మొత్తుకుంటున్నారు. 

చివరికి పాక్‌లో కూడా.. 

మన దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా కార్మికులకు మన కార్మికుల కంటే ఎక్కువ వేతనాలు అందడం గమనార్హం. అక్కడ నెలకు కార్మికులకు కనిష్ట వేతనంగా నెలకు 114 డాలర్లు (రూ. 9,526.88) అందుతున్నాయి. అదే మన ఇండియాలో కేవలం 45 డాలర్లు (రూ. 3,760.61) మాత్రమే అందుతున్నాయి. ఇక వెనకబడిన మరో దేశం నైజీరియాలో కూడా మనకంటే బెటర్‌గా నెలకు కనిష్టంగా 76 డాలర్లు (రూ. 6,351.25) వేతనంగా అందుతోంది. 

అభివృద్ధి ఇదేనా మోదీజీ.. 

అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. ఈ నివేదికను ఆయన షేర్ చేస్తూ.. బీజేపీ మీద నిప్పులు చెరిగారు. అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు? బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. తుగ్లక్ నిర్ణయాలతో దేశంలో నిరుద్యోగం పెరిగేందుకు మోదీ ప్రభుత్వం కారణమైందని విమర్శించారు. 

ప్రమాద ఘంటికలు

ఈ నివేదిక భవిష్యత్‌లో మన భారత కార్మికులకు వచ్చే ముప్పును చూపిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత ఐదేళ్లుగా నిరుద్యోగుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలా అంటూ ఫైర్ అయింది. జీఎస్టీ వంటి నిర్ణయాలతో ఎగుమతులు క్షీణించాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. మన దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే వచ్చే పదేళ్ల పాటు ఏడాదికి 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని జైరాం రమేష్ అన్నారు. పొంతన లేని పీఎం జమానాలో 7 శాతం జీడీపీ వృద్ధి కూడా మన యువతకు సరైన ఉద్యోగాలు కల్పించలేకపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.