నైజీరియా దేశస్థుడిని తిరిగి స్వదేశానికి పంపించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నైజీరియా దేశం నుంచి టూరిస్ట్ వీసాపై ఇండియాకి వచ్చి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ అనంతరం తిరిగి నైజీరియా కు పంపించారు. పోలీసుల కథనం ప్రకా రం.. నైజీరియా దేశానికి చెందిన ఈకేజీ ఇన్నోసెంట్ ఎండుకా 2009లో టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. మొదట్లో ముంబైలోని ఓ ప్రాంతంలో స్క్రాప్ వ్యాపా రం చేశాడు. అక్కడి నుంచి తమిళనాడుకు మకాం మార్చి నాలుగేళ్ల పాటు టీ షర్టులను విక్రయించాడు.
అనంతరం 2014లో బెంగళూరుకు వెళ్లాడు. 2024 మే నెలలో హైదరాబాద్‌లో ప్రవేశించి అక్రమ కార్యకలా పాలు నిర్వహించడం ప్రారంభించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు ఈకేజీని ఈ నెల 7వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈకేజీ తన వీసా, పాస్‌పోర్టు గడువు ముగిసినా ఇండియాలోనే ఉండిపోయాడని గుర్తించారు. ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడినా అడ్డంకులు లేకుండా తన దేశానికి తిరిగి వెళ్లేందుకు నకిలీ గుర్తింపు కార్డులు వంటివి సృష్టించుకున్నాడు. దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు, హెచ్‌న్యూ (హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్) అధికారులు కలిసి (ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) సహాయంతో ఈకేజీని మంగళ వారం నైజీరియాకి పంపినట్లు పోలీసులు తెలిపారు.