calender_icon.png 5 January, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేదిక మారినా అదే తీరు

04-01-2025 01:00:07 AM

  • భారత్, ఆస్ట్రేలియా ఐదో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 ఆలౌట్ బెంబేలెత్తించిన ఆసీస్ పేసర్లు
  • రోహిత్‌కు రెస్ట్.. తుది జట్టులోకి గిల్

సిడ్నీ: బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో వేదికలు మారుతున్నా భారత బ్యాటింగ్‌లో మాత్రం మార్పు కనిపించడం లేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జడేజా (26) పర్వాలేదనిపించాడు. టాపార్డర్ వైఫల్యం భారత్ కొంప ముంచింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలండ్ 4 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (7*) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 179 పరుగులు వెనుకబడి ఉంది.

కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను తుది జట్టులోకి రాగా బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. గాయంతో బాధపడుతున్న పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణను ఎంపిక చేశారు. 

అదే కథ.. అదే వ్యధ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న భారత్‌కు ఆరంభం నుంచే ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్ (4), జైస్వాల్ (10) తక్కువ స్లోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో గిల్, కోహ్లీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లంచ్ విరామానికి ముందు గిల్ ఔట్ కాగా.. బాధ్యతగా ఆడాల్సిన కోహ్లీ మరోసారి ఆఫ్‌స్టంప్ బలహీనతను బయటపెడుతూ బోలండ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఈ సిరీస్‌లో కోహ్లీ ఏడుసార్లు ఇదే తరహాలో ఔటవ్వడం గమనార్హం. టీ విరామం అనంతరం రెచ్చిపోయిన ఆసీస్ బౌలర్లు భారత్ పతనాన్ని శాసించారు. మొదట పంత్ వెనుదిరగ్గా..  సుందర్ (14) కాసేపు ప్రతిఘటించినప్ప టికీ ఫలితం లేకపోయింది. దీంతో 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ బుమ్రా (17 బంతుల్లో 22) మెరుగ్గా ఆడి చివరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

బుమ్రా వర్సెస్ కొన్‌స్టాస్

మెల్‌బోర్న్ టెస్టులో భారత స్టార్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య జరిగిన వాగ్వాదం అందరికి తెలిసిందే. తాజాగా సిడ్నీ టెస్టులో కొన్‌స్టాస్ ఈసారి బుమ్రాతో గొడవకు దిగాడు. ఆసీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. బుమ్రా ఐదో బంతి వేయడానికి ముందు స్ట్రుకింగ్‌లో ఉన్న ఖవాజా కాసేపు ఆగమన్నాడు.

ఏమైందంటూ బుమ్రా ఖవాజాను అడుగుతుండగానే మధ్యలో కొన్‌స్టా స్ కలగజేసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బుమ్రా ‘నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావంటూ’ కొన్‌స్టాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే కొన్‌స్టాస్ నోటికి పని చెప్పడం ఆపలేదు. గొడవ పెద్దది కాకముందే ఖవాజా, అంపైర్ వచ్చి సర్దిచెప్పారు. అయితే ఆ మరుసటి బంతికే ఖవాజా (2) స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బుమ్రా సహా భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటూ కొన్‌స్టాస్ వైపు దూసుకొచ్చారు. కానీ అతడు మారు మాట్లాడకుండా పెవిలియన్ బాట పట్టాడు.