calender_icon.png 15 January, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని వచ్చినా బల్బు వెలుగదు

18-07-2024 01:11:42 AM

  • రణథంబోర్ జోగీ మహల్ ప్రత్యేకత 
  • ఎంతోమంది ప్రముఖుల ఆతిథ్యమిచ్చింది 
  • విద్యుత్ సదుపాయం లేకుండానే బస చేయాలి

రణథంబోర్ (రాజస్థాన్), జూలై 17: వర్తమాన కాలంలో కరెంట్ లేకుండా జీవించడం నూటికి నూరు శాతం అసాధ్యమే. కానీ, రాజస్థాన్ రణథంబోర్‌లోని ఓ రాజమహల్ అందుకు పూర్తిగా విభిన్నంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 700 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మహల్‌లో ఇప్పటికీ విద్యుత్తు కనెక్షన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మహల్‌కు ఎవరైనా అతిథులు వచ్చినా వారికి విద్యుత్తు సదుపాయం ఉండ దు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి వచ్చినా వారి నిబంధనలను దాటి కరెంట్ సౌకర్యం కల్పించరు. దీని పేరు జోగీ మహల్. దీన్ని 700 ఏళ్ల క్రితం అప్పటి మహారాజు రావ్ హమీర్ తన గురువు కోసం నిర్మించారు. జోగిస్ అని పిలిచే నాథ్ శాఖ అనుచరుల నుంచి మహల్‌కు ఆ పేరు వచ్చింది. ఈ భవనంలో మొత్తం ఎనిమిది గదులు ఉంటాయి. ఇది పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటుంది.  

ప్రముఖులు వచ్చినా..

గతంలో దీన్ని ప్రముఖులకు వీఐపీ విశ్రాంతి గది కింద కేటాయించేవారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రఖ్యాత సినీనటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు ఈ భవనంలో బస చేశారు. అయినా ఈ భవనాన్ని విద్యుద్దీకరించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఇది ప్రజా జీవనానికి దూరంగా ఉండటంతో పాటు పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. అనంతరం రణథంబోర్ అటవీ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా మార్చడంతో 2005 నుంచి ఇక్కడ రాత్రి పూట వీఐపీలు బస చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం సమయంలో ఇక్కడ ఉండేందుకు అవకాశముంటుంది.