- ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం
- అవసరం లేకున్నా టెస్టుల పేర లూటీ
- అర్హత లేని వారితో ల్యాబుల్లో టెస్టులు
- ఆ రిపోర్టులతోనే వైద్యం
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు
- ప్రజల ప్రాణాలతో చెలగాటం
నాగర్‌కర్నూల్, జూలై 7 (విజయక్రాంతి): చిన్నపాటి దగ్గు, జలుబు, ఒల్లు నొప్పులతో ఆస్పత్రికి వెళ్తే జేబుకు చిల్లు తప్పడంలేదు. వ్యాధుల సీజన్ ప్రారం భం కావడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు రోగి అను మానాలకు మరింత భయాన్ని జోడించి అవసరం లేకున్నా రక్త, మూ త్ర పరీక్షలు రాస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరి పే పరీక్షలు పూర్తిగా పనికిరావం టూ వారు సూచించిన డయాగ్నోస్టిక్ సెంటర్లలో మా త్రమే పరీక్ష లు జరిపించాలని చెబుతున్నారు. రోగికి మెరుగైన వైద్యమందించా లంటే రక్త, మూత్ర పరీక్షలు తప్పనిసరి. ఇదే ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు కాసులపంట కురిపిస్తున్నది. కనీస అవగాహన, అర్హత లేనివారి తోనే ల్యాబ్ టెస్టులు జరిపించి వారిచ్చే రిపోర్టు ఆధారంగానే డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఫలితంగా అవసరం లేని మందులతో కొత్తరోగాలు కొనితెచ్చుకుని రోగులు నిండా మోసపోతున్నారు. ఈ తతంగం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు
నాగర్‌కర్నూల్ పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో పాటు జిల్లాలో మెడికల్ కళాశాల కూడా కొనసాగుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా యి. జిల్లా జనరల్ ఆస్ప త్రి చుట్టూరా ఆర్థో, స్కిన్, డెంటల్, న్యూరో, చిల్డ్రన్స్, ఫిజీషియన్ స్పెషలిస్టులంటూ కొత్త కొత్త ఆస్పత్రులు వెలు స్తున్నాయి. తగిన వసతులు లేకున్నా రోగి నుంచి రూ.వందల్లో ఓపీ ఫీజులు గుంజుతున్నారు. చిన్నపాటి దగ్గు, జలుబు, ఒల్లు నొ ప్పులతో ఆస్పత్రికి వెళ్తే మరింత భయభ్రాంతులకు గురిచేసి టెస్టులు రాస్తున్నారు. రోగుల నుంచి ఒక్కో టెస్టుకు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు.
ల్యాబుల్లో అధిక వసూళ్లు
ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు సూచించిన ల్యాబుల్లో చేసిన టెస్టులకు డాక్టర్ కమీషన్ 40 శాతాన్ని కలిపి వసూలు చేస్తున్నారు. దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ నిర్ధారణ టెస్టు కోసం ప్రైవేటు ల్యాబుల్లో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి వాటికి కూడా రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఏఎన్‌సీ ప్రొఫై ల్, థైరాయిడ్, హెచ్‌ఐవీ, హెచ్‌సివీ, వీడీఆర్‌ఎల్, పసిపిల్లలకు బిల్‌రూబిన్, పెద్దవారికి (ఎల్‌ఎఫ్‌టి) పసిరికలు, లివర్ ఫంక్షనింగ్, తలసేమియా వంటివాటి కోసం కూడా వైద్యులకు అం దించే 40శాతం పర్సంటేజీలను కలిపి రోగుల నుంచే ల్యాబుల్లో వసూలు చేస్తున్నారు.
పట్టించుకోని వైద్యాధికారులు
జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లో పీఎంపీ, ఆర్‌ఎంపీలు స్థాయికి మించిన వైద్యం చేస్తు న్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రోగి పరిస్థితి చేయిదాటిన సందర్భాల్లోనూ ఆర్ ఎంపీలు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేసి కమీషన్ దం డుకుం టున్నారు. అంతేకాకుండా జిల్లాలో సిం హభాగం ప్రైవేటు ఆస్పత్రులు అనుమతులు లేకుండానే నడిపిస్తు న్నట్లు ఆరోపణలున్నాయి. డయాగ్నోస్టిక్ సెం టర్లు కూడా అనుమతి, కనీస అర్హత లేకుండానే కొనసాగిస్తున్నారని తెలుస్తున్నది. తరచూ పర్యటించి పర్య వేక్షించా ల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్నది.
తనిఖీలు జరిపి చర్యలు తీసుకుంటాం
సీజన్ వ్యాధులు ప్రబలే సమ యం కావడంతో ప్రైవేటు ఆస్పత్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ల్యాబ్‌లను తనిఖీ చేసి, అర్హతలేని వారిపై చర్యలు తీసుకుంటాం. అధిక వసూళ్లపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. మరోసారి సమావేశాన్ని నిర్వహించి అధిక వసూళ్లను నియంత్రిస్తాం. అర్హతలేని, స్థాయికి మించిన వైద్యం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
సుధాకర్‌లాల్, వైద్యాధికారి, నాగర్‌కర్నూల్