- రైతు భరోసాకు రూ.9 వేల కోట్లు అవసరం
- వ్యవసాయ కూలీలకు మరో రూ.2 వేల కోట్లు
- మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల విడుదలకు సన్నద్ధం
- వెయ్యి కోట్లతో పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం
- స్థానిక ఎన్నికల ముంగిట సర్కారు దూకుడు
హైదరాబాద్, జనవరి5 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల ముంగిట.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోం ది. సర్కారుకు ఆర్థికంగా భారమైనా వెనక్కి తగ్గకుండా కొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఎన్నికల హామీని నిలబెట్టుకుంది.
దీని ద్వారా ఖజానాపై భారీగా భారం పడనుంది. రాష్ట్రంలో సుమారుగా 1.40 లక్షల ఎకరాల భూమి సాగులో ఉన్నట్టు ప్రభుత్వం అం చనా వేసింది. దీంతో రెండు సీజన్లకు కలిపి రైతులకు సుమారు రూ.9 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సం క్రాంతి నుంచే రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో తక్షణమే ప్రభుత్వానికి రూ.4.5 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు అవసరం అవుతా యి.
అలాగే రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూమిలేని రైతులను ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ధారిం చలేదు. ఉపాధి హామీ కార్డుల ఆధారంగా రాష్ట్రంలో భూమిలేని వారు రమారమీ 17 లక్షల మంది ఉండొచ్చని సర్కారు భావిస్తోంది.
దీంతో వీరికి ఏటా రైతు భరోసా కింద రూ.2 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉం టుంది. ఈ స్కీమ్‌లో మొదటి విడత కింద తక్షణం రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వానికి అవసరం ఉంది. అంటే రైతులు, రైతు కూలీలకు చెల్లించేందుకు సర్కారుకు ఇప్పటికిప్పుడు మొత్తం రూ.6 వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
సంక్రాంతికి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్
మరోవైపు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. త్వరలోనే కొంత బకాయిలను చెల్లిస్తామని ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటిం చింది. అలాగే, ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి కూడా రూ. 10 లక్షల లోపు ఉన్న బిల్లులను తాము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
దీంతో రాష్ట్రంలో రూ. 10 లక్షల లోపు బిల్లులు రూ.450 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని కూడా ప్రభుత్వం సంక్రాంతికి చెల్లించేందుకు సిద్ధమవుతోంది. బిల్లులు ఆగినవారిలో అటు ప్రతిపక్షాల వారితో పాటు అధికార పార్టీకి వారు కూడా ఉన్నారు.
త్వరలో స్థానిక ఎన్నికల జరగనున్న నేపథ్యం లో బిల్లులను విడుదల చేసి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులను సంసిద్ధం చేయాలని సర్కారు భావిస్తోంది. ఇవేకాకుండా రూ.1000 కోట్లతో పంచాయతీల రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది.
వచ్చేది తక్కువ..
వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. నెలకు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.6500 కోట్లు జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని, మరో రూ.6500 కోట్లు అప్పుల కింద కడుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. మిలిగిన సొమ్ముతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లు వంటి కొన్ని పథకాలు ప్రారంభించే దశలో ఉన్నాయి. వీటన్నింటిని అమలు చేయాలంటేనే సర్కారు నెలకు రూ.22,500 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు.
త్వరలో అమలు చేయబోతున్న రైతు భరోసా, అ తర్వాత వచ్చే ఇందిరమ్మ ఇళ్లు, అనంతరం వచ్చే మహిళలకు ఇచ్చే రూ.2500 స్కీమ్, రెసిడెన్సియల్ స్కూళ్ల నిర్మాణం, ఆర్‌ఆర్‌ఆర్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటివి పూర్తి చేయాలంటే.. ప్రభుత్వానికి నెలకు రూ.30వేల కోట్లు అవసరం అవుతాయి.
అవన్నీ పూర్తి కావాలంటే ప్రభుత్వానికి ఇప్పుడొచ్చే అదాయం కంటే రూ.11,500 కోట్లు అదనంగా రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీవ్రమైన ఆర్థికలోటులో ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.