calender_icon.png 7 January, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం డెడ్ స్టోరేజీకి చేరినా.. ఎస్సెల్బీసీ నీరందిస్తుంది

01-01-2025 12:20:47 AM

  1. 70 శాతం పూర్తయిన టన్నెల్ పనులను కేసీఆర్ సర్కారు పట్టించుకోలే
  2. కేటీఆర్ రెండు రోజులు ఎంజాయ్ చేయనీ... 3 లేదా 4 వతేదీన చూద్దాం
  3. నల్లగొండ ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  4. కేసీఆర్ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు  
  5. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరినా అక్కడి నుంచీ నీటిని తరలించి నల్లగొండ ప్రజల సాగు, తాగునీటిని కష్టాలను తీర్చడంలోనూ ఎస్సెల్బీసీ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు.

అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పైనా ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. కేటీఆర్‌ను రెండు మూడు రోజు లు ఎంజాయ్ చేయనివ్వండి.. కొత్త సంవత్సరం రోజు బాధ పెట్టకండి అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ గురించి ఈ నెల 3 లేదా 4 వ తేదీన చూద్దామని అన్నారు.

మంగళవారం జలసౌధలో నీటిపారుదల శాఖ అధి కారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలి సి కోమటిరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రా జెక్టులపై సమీక్ష నిర్వహించారు. అధికారుల తీరుపై కోమటిరెడ్డి అసహనం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం 70 శాతం పూర్తయిన ఎస్సెల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేయడానికి మీనమేషాలు లెక్కించిందని అన్నారు.

గత పదేండ్లలో 10 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం కూడా పూర్తి కాలేదని విమర్శించారు. అదే పూర్తయితే గత ఏడాది నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు క్రాప్ హాలీడే ప్రకటించే అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. 2005లో తాను అప్పటీ సీఎం వైఎస్‌ఆర్‌తో కొట్లాడి మంజూరు చేయించానని గుర్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రపూ రితంగా నిర్లక్ష్యం చేసి నల్లగొండ రైతులకు ద్రోహం చేసిందన్నారు. 

అమెరికా నుంచి టన్నెల్ బోరింగ్ మెషీన్ 

అమెరికాలో రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషన్ సంస్థతో మాట్లాడి టన్నెల్ బోరింగ్ పనులకు ఏర్పాటు చేసినట్టు కోమటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం బేరింగ్ షిప్ ద్వారా అమెరికా నుంచి వస్తుందన్నారు. మార్చి నాటికి ప్రాజెక్టు వద్దకు బోరింగ్ తెచ్చి పనులు పునః ప్రారంభిస్తామని స్పష్టంచేశారు.

4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీళ్లు, నల్లగొండ జిల్లాకు తాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టు అని, బ్రహ్మణవెల్లంల ద్వారా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని హెచ్చరించారు. కాంట్రాక్టర్ పని చేయకపోతే సంబంధిత మంత్రికి చెప్పాలని ఆదేశించారు.

ఎస్సెల్బీసీ ప్రాజెక్టు ఒక వరల్డ్ వండర్ అనీ, ప్రాజెక్టు పూర్తయితే  ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు. తన సోదరుడు 26 బోర్లు వేసినా నీళ్లు రాక వేసిన పంట వదిలేశారని.. నల్లగొండ అంత విపత్కర పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సెల్బీసీ ప్రాజెక్ట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, డిప్యూటీ సీఎం అందరూ చక్కగా సహకరిస్తున్నారని తెలిపారు.

20 నెలల్లో టన్నెల్ తవ్వకం పనులు పూర్తవుతాయిని చెప్పారు. నల్లగొండను రాబోయే నాలుగేళ్లలో ఏపీలోని గోదావరి జిల్లాలను మించి సస్య శ్యామలం చేస్తామని అన్నారు. ఆంధ్ర పాలకులే నల్లగొండకు న్యాయం చేశారని చెప్పారు. పదేళ్లు జిల్లాకు బీఆర్‌ఎస్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.

వేముల ప్రశాంత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు, ప్రగతి భవన్‌కు మంత్రిగా పనిచేశారని.. కేసిఆర్ యజ్ఞయాగాలు, పూజలు, హోమాలను చూసిన దేవాదాయశాఖ మంత్రిగా చేశారని విమర్శించారు. ఆయనకు రోడ్ల గురించి ఏం తెలుసు అని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు: మంత్రి ఉత్తమ్

కేసీఆర్ హయాంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రం ఆయకట్టుకు మాత్రమే నీరు అందించిందని విమర్శించారు. పాలమూరుకు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, దేవాదుల, కోయిల్‌సాగర్, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు. కృష్ణా 800 టీఎంసీలలో తెలంగాణకు 299 టీఎంసీ, ఆంధ్రాకు 519 టీఎంసీ ఇచ్చేందుకు గతంలో కేసీఆర్ ఒప్పుకొన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 500 టీఎంసీ నీళ్ల కోసం పోరాటం చేస్తున్నట్టు స్పష్టంచేశారు.

సమక్క సారలమ్మ ప్రాజెక్టు 44 టీఎంసీలు త్వరలోనే క్లియర్ కాబోతున్నాయని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు తేవాలని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 18౦౦ మంది లష్కర్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించబోతున్నామని వెల్లడించారు. ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు వచ్చే పది నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు.

అధికారులు బాధ్యతగా ఉండకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ ఈఈనీ సస్పెండ్ చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. 2024 ఏడాది నీటిపారుదల రంగంలో విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు.