- స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అభ్యర్థుల్లేరు..
- ఆ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదు..
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ప్రజలు ఛీకొట్టి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడించినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిలో మార్పు రాలేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థుల్లేరని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలకు పాల్పడితే ఎవరూ భయపడరన్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన కోరుకోవడంలేదని, ప్రజాపా లనను కోరుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పటికే లిక్కర్ స్కాంలో నిందితురాలని, ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ తమ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ, రైతుభరోసా, సన్నాలకు బోనస్, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.
తమ పాలనలో ఒక రేషన్‌కార్డు ఇవ్వని బీఆర్‌ఎస్, ఇప్పుడు 40 లక్షల వరకు రేషన్‌కార్డులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నదని మండిపడ్డారు.