calender_icon.png 28 November, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ వచ్చినా గోరక్షణ లేదు

10-10-2024 02:17:54 AM

గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి

బీజేపీ నేతలకు బీఫ్ కంపెనీల చందాలు

అతిపెద్ద పశుమాంస ఉత్పత్తిదారు యూపీ

రెండో అతిపెద్ద ఎగుమతిదారు భారత్

తిరుపతి ధర్మాచార్యుల చేతిలో ఉండాలి

పవన్ కల్యాణ్ పరిపాలన చేస్తే చాలు

సనాతన ధర్మ రక్షణ మేం చూసుకుంటాం

తిరుపతిలో నాడు జగన్ చేసిందే నేటి సర్కారూ చేస్తోంది

గోహత్యలకు పాల్పడేవారికి ఉరి శిక్ష విధించాలి

జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): హిందూ ధర్మ పరిరక్షణే తమ సిద్ధాంతంగా చెప్పుకొనే బీజేపీ కేంద్రం లో అధికారంలోకి వచ్చి, నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దేశంలో గోమాతలకు రక్షణ లేకుండా పోయిందని జోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ అన్నారు.

ఇప్పటికే ప్రపంచంలో భారత దేశమే పశుమాంసం ఎగుమతిలో రెండోస్థానంలో ఉన్నదని, దేశంలో పశుమాంస ఉత్పత్తిలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మొదటిస్థానంలో ఉన్నదని తెలిపారు. బీజేపీ నేతలు పశుమాంసం ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ బుధవారం రవీంద్రభారతిలో మీడియాతో మాట్లాడారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించే వరకు తమ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. గో సంరక్షణకు ముందుకు వచ్చిన పార్టీలకు, నేతలకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

2014లో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక గో సంరక్షణ జరుగుతుందని భావించామని, కానీ ఆయన ప్రధాని అయిన తొలి ఐదేళ్లు గోవధ మరింత పెరిగిందని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక గోవధ శాలలు భారీగా పెరిగాయని అన్నారు. అత్యాధునిక స్లాటర్ హౌజ్‌లు, సాంకేతికతను ప్రవేశపెట్టారని మండిపడ్డారు.

దీంతో నేడు ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత అత్యధికంగా పశుమాంసాన్ని ఎగుమతి చేసే దేశంగా భారత్ మారడం అవమానకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాచీన కాలం నుంచి గోవును తల్లిగా పూజించే దేశంలో ఈ పరిస్థితి రావడం దారుణమని అన్నారు.

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో సెంగోల్ దండాన్ని పట్టుకొని పాల్గొన్న మోదీ ఆ సెంగోల్‌పై ఉండే నంది మాతృమూర్తి అయిన గోమాతను రక్షించేం దుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గోమాతను సంరక్షించుకునేందుకు అన్ని రాష్ట్ర రాజధా నుల్లో గోధ్వజ్ స్థాపన చేస్తున్నామని, గత నెల 22న అయోధ్య నుంచి ఈ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. 

గోహంతకులకు ఉరి శిక్ష విధించాలి

దేశంలో గో హత్యలను పూర్తిగా నిషేధించాలని శంకరాచార్య స్వామీజీ డిమాండ్ చేశారు. మన పొరుగున ఉన్న నేపాల్‌లో గోహత్యకు పాల్పడితే ఉరి శిక్ష విధిస్తారని, ఆ విధంగా అక్కడ గోవులను సంరక్షిస్తున్నారని తెలిపారు. మన దేశంలోనూ గో హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని సూచించారు.

ప్రధాని మోదీ యే గోవధను అడ్డుకోలేకపోయినప్పుడు గో సంరక్షణ అంశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ నాయకుని మీదా తమకు విశ్వాసం లేకుం డా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గోమాతను సంరక్షించుకుంటూ రాష్ట్రమాతగా గుర్తించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నామని చెప్పారు. గోవు జంతువు కాదని గోమాత అనే విషయాన్ని ప్రభుత్వా లు గుర్తించాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోవును జంతువుగా కాకుం డా గోమాతగా గుర్తించాలని, గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోవధ లేకుండా చూడాలని కోరా రు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీఫ్‌ను మాత్రమే ఎగుమతి చేస్తున్నామని, గోమాంసం ఎగుమతి చేయడం లేదని అం టున్నారని.. మరి గో మాంసానికి ఏం పేరు పెడతారని? స్వామీజీ ప్రశ్నించారు. గోమాం సం ఎగుమతి చేయడం లేదంటే దేశంలో ఎక్కడికక్కడ గోవులతో వెళ్తున్న ట్రక్కులు ఎందుకు పట్టుబడుతున్నాయని నిలదీశారు. 

బీజేపీ మోసగించిందని భావిస్తున్నారు 

గోసంరక్షణకు కట్టుబడినవారికి మాత్ర మే ఓటు వేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. గో రక్షణ చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చినవారు తర్వాత మోసం చేశారు.. మళ్లీ అదే హామీతో అధికారంలోకి వచ్చేందుకు ఇతరులు ప్రయత్నిస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు మోసం చేసిన వారు పాపాత్ములుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.

బీజేపీ తమను మోసం చేసిందని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడిందని స్వామీజీ పేర్కొన్నారు. గో సంరక్షణ చేసేవారికే తాము ఓటేస్తామని రవీంద్రభారతి సభకు వచ్చిన వెయ్యి మంది సంకల్పం తీసుకున్నారని చెప్పారు. గోవును రాష్ట్ర మాతగా ప్రకటించాలని తాము ప్రధాని, రాష్ట్రపతిపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని స్వామీజీ తెలిపారు.

హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ వల్లే గో సంరక్షణ వీలవ్వనప్పుడు ఎవరి వల్ల అవుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ప్రజల ఓటుతో అంతా మారి పోతుందని అన్నారు. ప్రజల్లో గో భక్తి ఎంతో ఉందని చూస్తుండగానే ఒక్కోటి మా రిపోతాయని తెలిపారు. గో వధ లేకుండా ప్రజలను జాగృతం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. గోవును కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర జంతువుగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. 

భక్తులు కానుకలిచ్చి లాభమేంది?

తిరుపతిలో లడ్డూ వివాదంపై స్వామీజీ స్పందించారు. వైఎస్ జగన్ సర్కారు చేసినట్లే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా తప్పులు చేస్తోందని విమర్శించారు. భక్తులు సమర్పించిన అంత డబ్బు ఉన్నప్పుడు సొంత నిధులతో భారీ గోశాల నిర్వహించి సొంతంగా ఆవు నెయ్యి తయారు చేసి స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసేందుకు అవకాశం ఉందని స్వామీజీ అన్నారు.

ధర్మపరిరక్షణ కోసం చర్యలు తీసుకోనప్పుడు భక్తులు కానుకలు సమర్పించి లాభమేముందని ఆయన ప్రశ్నించారు. ధర్మ పరిరక్షణ చేసేవారికి తిరుపతి నిర్వహణ అప్పగించాలని, అప్పుడు స్వామివారి కార్యక్రమాలు ఎలాంటి అపవిత్రం జరగకుండా సాగుతాయని అన్నారు. లేదంటే తాము ఉద్యమం చేస్తామని తేల్చి చెప్పారు.

ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాలని ప్రజలు పవన్ కల్యాణ్‌కు అవకాశం ఇచ్చారని, ఆయనకు ధర్మ పరిరక్షణ ఎందుకని నిలదీశారు. అందుకు తామున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం పాల్గొన్నారు.