calender_icon.png 6 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేండ్లు కావొస్తున్నా పక్కా భవనాలేవీ?

06-02-2025 12:00:00 AM

  1. కొత్త మండలాల్లో వసతుల లేమీ
  2. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు
  3. అధికారులు, సిబ్బంది నిత్యం అవస్థలు 
  4. పట్టించుకోని పాలకులు

నల్లగొండ, ఫిబ్రవరి ౫ (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016లో పలు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించలేదు. దీంతో అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ అధికారులు అవస్థలు పడుతున్నారు.  సౌకర్యాల లేమీ కారణంగా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

మాడుగులపల్లిలో..

మాడుగులపల్లి మండలంలో ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ, పోలీస్ స్టేషన్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పాత పశువైద్యశాల భవనంలో నాలుగు గదులను తహసీల్దార్ కార్యా లయానికి కేటాయించారు. ఆయా భవనాలకు నెలనెలా దాదాపు రూ.20వేలుకుపైగా అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.2.50లక్షల ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నది.

గత  సర్కారు కార్యాలయాల పక్కా భవనాల నిర్మాణంపై దృష్టిసారించింది. బాపనకుంట సమీపంలో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. నాలుగు నెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం భవన నిర్మాణం సాగుతున్నది. 

తిరుమలగిరి(సాగర్)లో.. 

తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తున్నది. రెండేళ్లుగా ఈ భవనానికి నెలకు రూ.9వేలు చెల్లిస్తున్నారు.  అద్దె రూ.2 లక్షలకుపైగా బకాయి ఉన్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ స్థానిక వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్కు చెందిన రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయం పాత సింగిల్విండో భవనం లోని రెండు గదుల్లో కొనసాగుతున్నది. ఐకేపీ కారా లయాన్ని రేకుల షెడ్డు అద్దె భవనంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.

గుడిపల్లిలో..

గుడిపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తున్నది. ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పీఏసీఎస్ కార్యాలయాల నిర్మాణం ప్రసక్తే లేదు. ఏ పని కావాలన్నా గుడిపల్లి మండల వాసులు పీఏపల్లి మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తున్నది. మండలంగా ఏర్పడక ముందు ఎస్బీఐ, పోస్ట్టాఫీస్, పీహెచ్సీ కేంద్రం ఉన్నాయి. మండలంగా ఏర్పాటయ్యాక తహ సీల్దార్ కార్యాలయ్యాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకున్నారు.

గట్టుప్పల్లో..

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 2023 నవంబర్లో ఈ మండలాన్ని 8 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, వ్యవసాయశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పక్కా భవనాలు నిర్మించాలని ఇటీవల ఎమ్మెల్యే రాజగోపా ల్రెడ్డికి స్థానిక నాయకులు విన్నవించారు. ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట నిర్మించేందుకు కసరత్తు జరుగుతుంది.