calender_icon.png 7 November, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చివేసినా.. దర్జాగా పనులు

15-08-2024 01:52:03 AM

  1. మణికొండలో అక్రమార్కుల బరితెగింపు
  2. మంగళవారం ఓ భవనం స్లాబ్‌ను కూల్చివేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు
  3. బుధవారం తిరిగి పనుల నిర్వహణ

రాజేంద్రనగర్, ఆగస్టు 14: అక్రమ నిర్మాణదారులు బరితెగించారు. వారు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే కనిపించడం లేదు. అంతా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్ పటేల్ పార్కుకు ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అధిక అంతస్తులు నిర్మించిన ఓ భవనంలోని స్లాబ్‌ను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లారు. అయితే, కూల్చివేతలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ తర్వాత ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనిని ఆసరాగా తీసుకున్న అక్రమ నిర్మాణదారుడు బుధవారం భవనం ముందు భాగంలో గేటుకు తాళం వేసి లోపల ఐదుగురు కూలీలతో గుట్టుగా పనులు చేయించాడు. కాగా, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలు లేనిదే పనులు నిర్వహించరని, ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వ్యవహారంలో మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు తీరు అనుమానాలకు తావిస్తోంది. వ్యవహారం కుదిరితే ఓకే.. లేదంటే కూల్చివేయడం జరుగుతుందని, మళ్లీ వ్యవహారం సెటిల్ అయితే తిరిగి పనులు చేపడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.