calender_icon.png 17 January, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయమైనా.. గమ్యం మరువలే

16-09-2024 04:36:27 AM

ఒకే ఒక్క సెంటీ మీటర్

  • డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానం సాధించిన నీరజ్ చోప్రా
  • 1 సెం.మీ తేడాతో తొలి స్థానం దూరం
  • విరిగిన చేతితోనే ఈటె విసిరిన యోధుడు

విజయక్రాంతి ఖేల్ విభాగం: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బ్రస్సెల్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో స్థానం సంపాదించాడు. 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం సాధించాడు. తొలి స్థానంలో నిలిచిన అండర్‌సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. నీరజ్ కంటే కేవలం ఒక్క సెంటిమీటర్ ఎక్కువగా విసిరాడు. ఇక జర్మనీకి చెందిన జావెలిన్ త్రోయర్ జులియన్ వెబర్ 85.97 మీటర్ల త్రోతో మూడో స్థానంలో నిలిచాడు. 

చేతి వేలు మలుచుకుపోతేనే తండ్లాడుతాం.. ఏమీ చేయకుండా కూర్చుంటాం.. కానీ అటువంటిది ఓ వేలు విరిగినా కానీ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వెనుకడుగు వేయలేదు. ఆ గాయంతోనే పాల్గొని రెండో స్థానం సంపాదించాడు. తృటిలో తొలి స్థానం చేజారింది కానీ లేకుంటే మనోడే టాప్‌లో నిలిచేవాడు. ఏదేమైనా నీరజ్ నువ్వు నిజంగా రాజువే భాయ్.. నొప్పి వేధిస్తున్నా.. 

బ్రస్సెల్స్‌లో జరిగిన ఫైనల్స్‌లో పాల్గొన్న నీరజ్ చోప్రాకు ఎడమచేతి ఉంగరపు వేలు విరిగింది. అతడు ఆ నొప్పితోనే పోటీలో పాల్గొన్నాడు. నొప్పి వేధిస్తున్నా కానీ నీరజ్ మాత్రం తన పట్టుదలను కోల్పోలేదు. పట్టువిడవని విక్రమార్కుడిలా 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం దక్కించుకున్నాడు. తాను బ్రస్సెల్స్ ఈవెంట్‌లో నొప్పితోనే పాల్గొన్నానని నీరజ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

చేతి ఎక్స్‌రే ను కూడా పోస్ట్ చేశాడు. ‘2024 సీజన్ ముగిసింది. ఈ సంవత్సరం ఎంతో మెరుగయ్యా. కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా కానీ శాయశక్తులా కృషి చేశా. 2024 నాకు అథ్లెట్‌గా మంచి పేరు తెచ్చింది. నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. 2025లో కలుద్దాం’ అని పోస్ట్ చేశాడు.