07-03-2025 12:26:14 AM
పెబ్బేరు, మార్చి 6 : ఆరోగ్యం బాగాలేకున్నా, ఒంట్లో నలతగా ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది డాక్టరే. ఇటువంటి సమయంలో ఆరోగ్యం మెరుగుపడేందుకు కనిపించని దేవుడి కంటే ముందు డాక్టర్‌నే రోగులు మొక్కుతుంటారు. గ్రామీణ ప్రాంతాల లో ఉండే ప్రజలు ఆయా గ్రామాలలో వైద్యంచేసే ఆర్‌ఎంపీలనే డాక్టర్లుగా భావించి వైద్యం చేయించుకోవటం పరిపాటిగా మారిం ది.
గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదల అమాయకత్వాలను ఆసరాగా చేసుకుని, కొందరు అవినీతి అధికారుల అండదండలతో తామే వైద్యులమని ఇష్టానుసారంగా చికిత్సలు చేస్తున్నారు. వారికి వచ్చిరాని వైద్యం చేయడంతో అమాయక ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది.
ఆర్‌ఎంపీలు చేయాల్సిందేంటి..?
పెబ్బేరు మండలంలో పిఎంపీ, ఆర్‌ఎంపీలు దాదాపుగా 75 మంది వైద్యం అందిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. గత 15ఏండ్ల కింద నాటి ప్రభుత్వం గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని చెప్పారే తప్ప ఆచారణకు నోచుకోలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వైద్యులుగా చలామణయ్యే ఆర్‌ఎంపీలు కేవాలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది.
జ్వరం వచ్చినా, కిందపడి దెబ్బ తగిలినా, ఇతరత్రా అనారోగ్యాలకు గురైనా స్థానికంగా వారు నిబంధనలకు లోబడి ప్రథమ చికిత్సలు చేయాలే తప్ప, గ్లూకోజ్ బాటిళ్లు పెట్టటం, మందులు రాయటం, గర్భిణులు, బాలింతలకు, చిన్న పిల్లలకు వైద్యం చేయటం చట్టరీత్యా నేరం. వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన స్కానింగ్ పరికరాలు వాడటం కూడా నిబంధనలకు వ్యతిరేకమే.
ఇవన్నీ తమకేమీ పట్టవన్నట్లు వైద్యఆరోగ్య శాఖలో ఉన్న కొందరి అధికారుల అండతో ఆర్‌ఎంపీలు ఇష్టానుసారంగా వైద్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాస్థాయిలో ఉండే కొందరు అధికారులు తనిఖీలు చేపట్టకుండా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లుతున్నారనే ఆరోపణలు బహిరంగ వినిపిస్తున్నాయి. పిర్యాదులు ఇస్తే తప్ప ఆర్‌ఎంపీ క్లినిక్‌లపైన దాడులకు పాల్పడుతున్నారే తప్ప తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వేలల్లో కమీషన్ల దందా..
వచ్చిరాని వైద్యంతో దర్జాగా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఎందరో ఆర్‌ఎంపీలు వేల రూపాయల విలువచేసే కమిషన్ వైద్యానికి తెరలేపారు. పెబ్బేరు మున్సిపాలిటీతో పాటు మండలంలో ఆర్‌ఎంపీలకు ఈ కమిషన్ వైద్యం మూడు మువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందనేది వాస్తవం. కర్నూలుకు రోగులను పంపి కమిషన్ ద్వారా వచ్చిన ఆదాయమే కొందరు ఆర్‌ఎంపీలకు వేలల్లో ఉంటుందంటే వారి వ్యాపార వైద్యం ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఒక రోగి ఏదైనా అనారోగ్యంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్దకు వెళితే కర్నూలులో ఉండే పెద్ద డాక్టర్‌కు చూపించాలని, లేదంటే రోగం ముదురుతుందని చెప్పి ఆ రోగిని ఆర్‌ఎంపీలు కర్నూలులోని తమకు అనుకూలమైన ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు. అప్పటికే ఆర్‌ఎంపీకి, కర్నూలులో ఉండే నర్శింగ్ హో మ్ నిర్వాహకులకు ఉన్న ఒప్పందం మేరకు రోగికి అయిన ఆస్పత్రి ఖర్చులో 30 నుంచి 40శాతం ఒక ఆర్‌ఎంపీకే చెల్లిస్తారంటే ఈ ప్రాంతంలో కమిషన్ వ్యాపారం ఏపాటిగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.
పర్యవేక్షణ లేని మెడికల్ షాపులు..
పెబ్బేరు మున్సిపాలిటీతో పాటు మండలంలో ఆర్‌ఎంపీలు మెడికల్ దుకాణాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు ముడుపులకు ఆశపడి అటువైపే కన్నెత్తి చూడరనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఆర్‌ఎంపీలు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ చిట్టి రాయకూడదు. దర్జాగా చిట్టిపై మందులు రాసి కొనుక్కోమని రోగులకు సూచిస్తున్నారు.
కొందరైతే మెడికల్ షాపులల్లో ఫిజీషియన్ షాంపుల్స్ మందులను విక్రయిస్తున్నారు. దానికి ఉదాహరణ గతంలో మండలంలోని సుగూరు గ్రామంలోని ఒక ఆర్‌ఎంపీ నిబంధనలకు విరుద్ధంగా మందులను రోగులకు అంటగడుతున్నారనే సమాచారం తెలుసుకున్న జిల్లా ఔషధ నియంత్రణ అధికారి తనిఖీ చేపట్టారు. ఆర్‌ఎంపీ చికిత్సాలయంలో ఫిజీషియన్ తో పాటు పలు రకాల మందులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి.
నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గతంలో నిబంధనలు పాటించని క్లినిక్ లను సిజ్ చేయడంతో పాటు పలువురి ఆర్‌ఎంపీల పై కేసులు నమోదు చేశాం. తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.
డాక్టర్. శ్రీనివాసులు