- ఆగని రేషన్ దందా
- ఇందూర్‌లో రెచ్చిపోతున్న అక్రమార్కులు
కామారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నది. ఈ దందా చేసే అక్రమార్కులపై ఎన్నిసార్లు కేసులైనా, పోలీసులకు ఎన్నిసా ర్లు పట్టుబడినా చట్టంలోని లొసుగులు తమను ఏమి చేయలేవనే ధీమాతో రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు.
ప్రతినెల ఉచితంగా ప్ర భుత్వం అందించే బియ్యా న్ని కొందరు వినియోగదారులు అక్రమార్కులకు అమ్ము తున్నారు. రేషన్ డీలర్లు సైతం రేషన్ బియ్యం వద్దు అనుకునే వారికి బియ్యానికి బదులు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లించి ఆ బియ్యాన్ని అక్రమార్కులకు అంటకడుతున్నారు. దీంతో రేషన్ బియ్యాన్ని రీస్లుకింగ్ చేసి సన్నబియ్యం పేరుతో బ్రాండ్ కవర్లు వేసి బయట మార్కెట్‌లో అమ్ముతున్నారు.
మాముళ్లతో చక్కదిద్దుతున్నారు
రేషన్ బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తున్న ముఠా.. అధికారులను మామూళ్లతో చక్కబెడుతున్నారు. ప్రతి నెల మామూళ్లు నెలసారి జీతంలాగా వస్తుండంటతో అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి నెల టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ముఠాలు రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ బియ్యం కింద అమ్ముతున్నారు.
మరికొన్ని బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో కేవలం 15 రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వచ్చి న దాంట్లో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు కొంతమంది ప్రజాప్రతినిధులకు నెలస రి మామూళ్లు ముట్ట జెప్పుతున్నారు.
దీంతో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న రెవె న్యూ అధికారులు, టాస్క్‌పోర్స్ అధికారు లు, ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు మాత్రం తమ టార్గెట్‌కు అనుగుణంగా కొన్ని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
టన్నుల కొద్దీ పట్టుబడిన బియ్యం
గత నెలరోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని రైస్‌మిల్లులో రెండు లారీల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశారు. గత శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఈ కేసులో గత నెల క్రితం పట్టుబడిన వ్యక్తులే ఉండటం గమనార్హం. దీన్నిబట్టి కేసులైనా పట్టించుకోకుండా దందాను ఏ విధంగా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని వజ్రా ఇండస్ట్రీస్‌లో 560 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.
మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్‌లో సోమవారం మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆజాంకాల నీలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద డీసీఎంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. అప్సర్ అనే వ్యక్తికి చెందిన 70 బస్తాల రేషన్ బియ్యా న్ని తరలిస్తున్న అమీర్ మహమ్మద్ అలియాస్ చావుస్‌ను పట్టుకున్నారు. బియ్యంతో పాటు వాహనా న్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజుల్లా నుంచి మహారాష్టకు ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం బిచ్కుంద ఎస్సై మోహన్‌రెడ్డి పట్టుకున్నారు. 20 బస్తాల బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించా రు. ఆటో డ్రైవర్ గణేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
రేషన్ బియ్యం దందాపై కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాజేందర్‌ను వివరణ కోరాగా.. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొనడం గమనార్హం. అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రసుత్తం ధాన్యం కొనుగోలులో బీజీగా ఉన్నామని తెలిపారు.