- రేవంత్ పాలనతోనే కేసీఆర్ విలువ తెలిసేది
- హనుమకొండ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఓటమి కూడా బీఆర్‌ఎస్‌కు మంచే చేసిందని, రేవంత్ పాలనతోనే ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తుందని ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో హనుమకొండ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో బుధవారం సమావేశమైన కేటీఆర్ వారినుద్దేశించి మాట్లాడారు ఎన్ని అటుపోట్లు ఎదురైనా తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. 24 ఏళ్ల ప్రస్థానంలో 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా ఉన్నామని, ఇప్పుడు ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిద్దామన్నారు.
డీఎంకే పార్టీ 76 ఏండ్లుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తోందని, మన పార్టీ ఇంకా వందేళ్లు ఉండాలంటే మనం మరింత ధృడంగా తయారు కావాలన్నారు. తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటు లో ఉండే వినయ్ భాస్కర్ ఓడిపోవటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
ఎన్నికల సందర్భంగా ఆడబిడ్డలకు తులం బంగా రం అన్న రేవంత్‌రెడ్డి తులం ఇనుము కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 90 లక్షల రేషన్ కార్డులుంటే 25 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ సిలిండర్ల పథకం వర్తింపజేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మళ్లీ నా లుగేళ్లలో కేసీఆర్‌ని సీఎంగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టేషన్ ఘన్ పూర్‌లో ఉప ఎన్నిక వస్తదని, అక్కడ బీఆర్‌ఎస్ తరుఫున రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘నీ బావమరది కంపెనీకి రూ. 2 కోట్లు లాభం ఉంటే 1,137 కోట్ల పనులు ఎలా ఇచ్చావ్’ సీఎంను అని ప్రశ్నించారు.
నల్లగొండ మంత్రుల అరాచకాలను ఎండగడుదాం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మంత్రులు అధికార దాహంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వారి అరాచకాలను ప్రజల్లో ఎండగడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి అండతో కాంగ్రెస్ నేతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వారిద్దరిపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గొంగిడి సునీతారెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.