calender_icon.png 5 November, 2024 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

300 రోజులైనా హామీలు నెరవేర్చలేదు

03-11-2024 02:06:45 AM

  1. అన్నివిధాల రేవంత్ సర్కార్ విఫలం
  2. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన వంద రోజు ల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 300 రోజులైనా చేసిందేమీ లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరో పించారు. శనివారం ఎక్స్‌వేదికగా స్పంది స్తూ  కొత్త హామీల సంగతి దేవుడెరుగు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను సైతం అటకెక్కించిందని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పాలనలో 1,61,000 పోస్టులను భర్తీ చేస్తే.. ఆ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రసంగాలు దంచుతున్నారని, కాంగ్రెస్ చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, ధ్రువపత్రాల  పరిశీలన పూర్తి చేసినవేనన్నారు.

ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న నియామక పత్రాలిచ్చి, అవన్నీ తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జునఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు 10 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. 2023, డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ఆరునెలలు గడిచినా ఇంకా సగం మంది రైతులు రుణమాఫీకి ఎదురు చూస్తున్నారని, ప్రతినెలా రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా, 11 నెలల తర్వాత కూడా వారికి ఇవ్వలేదన్నారు.

18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలో పెట్టలేదన్నారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఇంకా ప్రారంభించలేదని, ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, సన్నాలకు మాత్రమే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ పత్తాలేదని, మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ ఎప్పుడో మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇవే కాకుండా రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, పోషకాల కిట్, బతుకమ్మ చీరలు వంటి పథకాలెన్నో నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.