calender_icon.png 27 September, 2024 | 8:59 PM

కాంగ్రెస్ గొడవలు పిల్లలకూ తెలుసు

27-09-2024 12:50:37 AM

  1. వాళ్లు ప్రతిపపక్షంగానూ విఫలమయ్యారు
  2. హర్యానా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ
  3. పరమ్‌రుద్ర సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ

చండీగఢ్, సెప్టెంబర్ 26: కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల గురించి హర్యానాలో చిన్నపిల్లల కు కూడా తెలుసని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ పార్టీ ఈ అంశంపైనే ఎక్కువ సమయం కేటాయిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు బీజేపీకి మరొక చాన్స్ ఇవ్వాలని హర్యానా ప్రజలను ప్రధాని మోదీ కోరారు. నమో యాప్ ద్వారా హర్యా నా బీజేపీ కార్యకర్తలతో గురువారం మోదీ ముచ్చటించారు. రాబోయే ఎన్నికల కోసం బూత్ స్థాయిలో ఫీల్డ్ వర్క్ గురించి చర్చించి, ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వ్యూహాన్ని రూపొందించాలని కార్యకర్తలను ప్రోత్సహించారు. గడిచిన 10 ఏళ్లలో ప్రతిపక్షంగానూ కాంగ్రెస్ విఫలమైందని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ బలహీనపడింది

కాంగ్రెస్ ఎప్పుడూ పార్టీలో కలహాలపైనే దృష్టి సారిస్తుందని, ఎన్నికల్లో కేవలం అబద్ధాలతోనే కాంగ్రెస్ పోరాడుతుందని మోదీ అన్నారు. రోజురోజుకూ బలహీనమవుతోందన్నారు. పదేళ్లలో హర్యానాలో అవినీతి రహిత ప్రభుత్వం నడిపినందుకు గర్వంగా ఉందని మోదీ అన్నారు. లంచాలు లేకుండా యువతకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. 

పుణె పర్యటన రద్దు

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా మోదీ పుణె పర్యటన రద్దయింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం గురువారం పుణెకు మోదీ చేరుకోవాల్సి ఉంది. పుణెలోని జిల్లా కోర్టు నుంచి స్వర్‌గేట్ మెట్రో రైలుతో పాటు రూ.20 వేల కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. 

సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ 

దేశీయంగా అభివృద్ధి చేసిన ౩ పరమ్‌రుద్ర సూపర్ కంప్యూటర్లను మోదీ ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం రూ.౧౩౦ కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం రూ.౮౫౦ కోట్లతో రూపొందించిన హై కంప్యూటింగ్ వ్యవస్థను సైతం ప్రధాని ఆవిష్కరించారు. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా విజయాలు సాధించిన రోజుగా పేర్కొన్నారు.