- వచ్చే ఏడాది చివరి వరకు.. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఢిల్ల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని.. సోమవారం నుంచి ఈ పాలసీ అందుబాటులోకి వస్తుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నెంబర్ 41 ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం సచివాలయంలో మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చే ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గి రాష్ట్రంలో వాటి వెల్లువ ప్రారంభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఈవీ పాలసీ ద్వారా కేవలం 5వేల వాహనాలకు మాత్రమే పరిమితం అయి ఉండేదని తమ ప్రభు త్వం మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి విధించలేదని..
ఎంత మందైనా వీటిని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ట్యాక్స్ రాయితీ పొందవచ్చన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయని... సగటును రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయని.. ఈ సంఖ్య భారీగా పెరగాల్సి ఉందని తెలిపారు.
ఎలక్ట్రిక్, 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికిల్స్, ట్రై గూడ్స్ వెహికిల్స్‌పై వచ్చే ఏడాది చివరివరకు ఇకపై ఎలాంటి పన్నులు విధించబోమని తెలిపారు. ఆర్టీసీ ఈవీ బస్సులకు సైతం ఈ పాలసీ వర్తిస్తుందని అన్నారు. ఈవీ వాహనాలకు తగ్గట్లుగా కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అందరూ ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించే బాధ్యతను అందరూ సంయుక్తంగా తీసుకునాలని మంత్రి సూచించారు.
15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌గా మార్చి కొత్తగా కొనే వాహనం రిజిస్ట్రేషన్‌పై మినహాయింపులు పొందాలని ఆయన కోరారు. అలాగే వాహనదారులకు పొల్యూషన్ పరీక్షలపై అవగాహన కల్పించి కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
అందుకే ఆటోమేటిక్ పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తెలంగాణ రవాణా శాఖకు కొత్త లోగోను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మీడియా సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.