దశల వారీగా తీసుకొస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
- విలీనమూ.. ఒక్క ఉద్యోగ నియామకమూ లేదు
- ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్న ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ కోసం ఆర్టీసీలో దశలవారీగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు.
కాలుష్య కట్టడికి ఇది మంచి ఆలోచనే అయినా.. ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఈవీ బస్సులన్నీ కొన్ని ప్రైవేట్ కంపెనీలకు చెందినవే కావడంతో ప్రభుత్వం, యాజమా న్యంపై ఆర్టీసీ కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అద్దె బస్సుల విధానాన్ని కూడా కాదని నేరుగా కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకొస్తూ.. ప్రైవేటు సంస్థలకు డిపోలను అప్పగించి, యాజమాన్యం సొంత బస్సులను తగ్గించుకునే కార్యక్రమం చేస్తోందా? అని సందేహపడుతున్నారు.
మూడువేల ఉద్యోగ నియామకాలు చేపడతామన్న ప్రభుత్వం, ఉన్న ఉద్యోగుల పొట్ట కొట్టకుంటే చాలని ఆర్టీసీ యూనియన్ల నేతలు అంటున్నారు. ఈవీ బస్సులను ప్రైవేట్ సంస్థలకే అప్పగిస్తే కండక్టర్ మినహా మిగతా ఉద్యోగులతో అవసరం ఉండదని ఆర్టీసీ జేఏసీ నాయకులు అంటున్నారు. ఆర్టీసీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
త్వరలో 3వేల ఈవీ బస్సులు..
హైదరాబాద్ నగరంలోకి త్వరలోనే 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవలే సీఎం రేవంత్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తదనంతరం గ్రేటర్‌లో ఉన్న డీజిల్ బస్సులను జిల్లాలకు పంపిస్తామని వారు తెలిపారు. అయితే ఆర్టీసీ సగటు లెక్కల ప్రకారం ఒక్క బస్సుకు ఐదుగురు ఉద్యోగులు (డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ సహా మరో ఉద్యోగి) కార్మికులుగా పనిచేస్తారు.
డీజీల్ బస్సుల తొలగింపు తర్వాత స్వయంగా ఆర్టీసీ ఈవీ బస్సులను కొనుగోలు చేస్తే కార్మికులకు ఇబ్బందేమీ ఉండదు. కానీ.. ప్రైవేట్ కంపెనీల ద్వారా ఈవీ బస్సులను తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న కార్మికుల్లో చాలామందికి పని ఉండదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
విలీనం అని అధికారంలోకి వచ్చి...
‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. మీరంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు’ అని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటిపోయింది. ప్రభుత్వంలో విలీనం చేయడం మాట అటుం చితే.. ఆర్టీసీ ఉనికిని ఉండనిస్తే చాలనే పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నియామకం కూడా చేపట్టలేదు.
త్వరలో 3వేల ఉద్యోగాలు అంటూ ఊరిస్తూ వచ్చిన ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పుడు సప్పు డు చేయడం లేదని కార్మికులు అంటున్నా రు. హైదరాబాద్‌కు మొదట ప్రైవేటు కంపెనీల ద్వారా ఈవీలను తీసుకొచ్చి.. క్రమంగా జిల్లాల్లోనూ అదే కంపెనీలకు బస్సులను అప్పగించి తమను ఆగం చేస్తారేమోనని కార్మికులు సందేహపడుతున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం, యాజమాన్యం చాపకింద నీరులా అడుగులు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీని నాశనం చేసే కుట్ర..
ఇప్పటి వరకు ఆర్టీసీలో టెండర్లు వేసి హైర్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేవాళ్లు. ఈవీ బస్సులను మాత్రం రెండు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇందులో ఒకటి మేఘా కృష్ణారెడ్డికి చెందిన ఒలెక్ట్రా కంపెనీ కాగా.. మరొకటి జేబీఎం కంపెనీ. ఈ రెండు కంపెనీలకు ఈవీ బస్సులను నడుపుకునేందుకు కాకుండా డిపోలనే అప్పగించేస్తున్నారు.
నగరంతోపాటు కరీంనగర్, వరంగల్‌లో ఇప్పటికే ఆ పని చేశారు. కరీంనగర్ డిపోను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అక్కడి కార్మికులను కోరుట్ల, మెట్‌పల్లి డిపోలకు పంపారు. ఇలా నేరుగా డిపోలనే ప్రైవేటు కంపెనీలకు ఎట్లా అప్పగిస్తున్నారు. ఈవీ బస్సులకు మేం వ్యతిరేకం కాదు కానీ.. ఆ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలి.
ఇప్పుడు ఎట్లాగూ రవాణా శాఖ ఈవీ వాహనాలకు వంద శాతం ట్యాక్స్ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఛార్జీ లు మాఫీ చేసింది కాబట్టి ప్రభుత్వమే వాటిని కొని ఆర్టీసీకి ఇవ్వాలి. అలా కాదని ప్రైవేట్‌కు అవకాశం కల్పిస్తే ఇక ఆర్టీసీని కనుమరుగు చేసేందుకు కుట్రగానే భావించాల్సి వస్తుంది.
థామస్‌రెడ్డి,
ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్
ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే..
ఈవీ బస్సులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతూ వాటి ప్రారంభానికి రవాణా శాఖ మంత్రి వెళ్లడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆర్టీసీని నాశనం చేసేందుకు సిద్ధమైనట్లు అనిపిస్తుంది. ఈవీ పాలసీతో 3వేల బస్సులను తీసుకొస్తూ ప్రైవేటు కంపెనీలకు లాభం చేస్తున్నారని అనుమా నం కలుగుతోంది.
ప్రైవేటు కంపెనీలకు రూ.కోట్ల రిజిస్ట్రేషన్ చార్జీలు, ట్యాక్స్ మినహాయింపులు కల్పించేందుకే ఈ పాలసీ తెచ్చారనిపిస్తోంది. అలా కాదని నిరూపించాలంటే ఆర్టీసీనే సొంతంగా ఈవీ బస్సులను కొ నుగోలు చేయాలి. ఆ విధంగా ప్రభు త్వం నుంచి ఈవీ పాలసీ ద్వారా వచ్చే రాయితీలను ఆర్టీసీకే దక్కేలా చేయా లి.
లేదంటే ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై ఈవీ ముసుగులో సంస్థను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని భావించాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులపైనే పోరాడిన ఆర్టీసీ కార్మికులకు స్వరాష్ట్రంలోనూ పోరాటం తప్ప దని మాకు అర్థం అవుతోంది.
ఈదురు వెంకన్న,
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్