calender_icon.png 21 November, 2024 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరోపా గజగజ!

21-11-2024 02:12:12 AM

మాస్కోపై ఉక్రెయిన్ దాడి తర్వాత కీలక పరిణామాలు

కీవ్‌లో అమెరికా సహా పలు ఐరోపా దేశాల ఎంబసీలు బంద్

రష్యాకు కిమ్ సైనిక, ఆయుధ సాయం

10 వేల మంది సైన్యంతో పాటు ఆయుధాల సరఫరా

అణ్వస్త్రాలపై పుతిన్ నిర్ణయంతో ఐరోపాలో టెన్షన్

ఏం జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

న్యూఢిల్లీ, నవంబర్ 20: అమెరికా రూపొందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించడంతో యూరోప్‌తో పాటు పశ్చిమ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయానికి సిద్ధమైంది. ఇప్పటికే రష్యాకు 10,900 మంది సైనికులను పంపగా మరిన్ని ఆయుధాలను సైతం అందించింది. రష్యాకు అదనపు కెనాన్ (ఫిరంగులు) వ్యవస్థను అందజేసినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.

రష్యా తరఫున వేలాది మంది కిమ్ సేన యుద్ధంలో పోరాడుతున్నారని తెలిపింది. తాజాగా 170 రైఫిళ్లు, 240 రాకెట్లు సైతం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆయుధాలను వాడే నైపుణ్యం రష్యాకు లేకపోవడంతో వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర కొరియా నుంచి సిబ్బంది కూడా వెళ్లినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో తరుగుతోన్న ఆయుధాల నిల్వను నింపేందుకు ఉత్తరకొరియా గతేడాది నుంచి రష్యాకు కెనాన్లు, క్షిపణులు సహా ఇతర సంప్రదాయ ఆయుధాలను పంపిస్తోంది. ఇప్పటివరకు 13 వేలకు పైగా ఆయుధ కంటెయినర్లు పంపినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది.     

ఎంబసీ మూసేసిన అమెరికా

ఉక్రెయిన్ దాడులతో పుతిన్ తీవ్రంగా స్పందించడంతో అమెరికా అప్రమత్తమైంది. రష్యా ప్రధాన టార్గెట్ కీవ్‌లోని అమెరికా రాయబారం కార్యాలయమని సమాచారం రావడంతో అక్కడి ఎంబసీని తాత్కాలికంగా మూసేసింది. నవంబర్ 20న భారీ వైమానిక దాడికి రష్యా సిద్ధమైనట్లు తమ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు ఎంబసీ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్ అలర్ట్‌లు రాగానే షెల్టర్లలోకి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఐరోపా దేశాలైన ఇటలీ, స్పెయిన్, గ్రీస్ కూడా తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశాయి.    

బ్రిక్స్‌తోనే యుద్ధానికి పరిష్కారం

ఉక్రెయిన్‌తో చర్చల విషయంలో ప్రస్తుతం సరైన పరిస్థితులు కనిపించిడం లేదని, అయితే తాము అందుకు సిద్ధంగా ఉందని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిష్కారానికి బ్రిక్స్ సరైన వేదిక కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాలకే ఈ సామర్థ్యం ఉందని చెప్పారు. 

అణు ముప్పు తప్పదా?

రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై 1,000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించింది. కిమ్ సైన్యం రష్యాకు వచ్చిన నేపథ్యంలోనే ఈ క్షిపణులను వాడేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే రష్యాపై ఉక్రెయిన్ వీటితో దాడి చేసింది. ఈ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లుంది.

ఈ దాడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధ వినియోగానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు పశ్చిమదేశాలు తమదేశంపై నేరుగా దాడిచేస్తే న్యూక్లియర్ అటాక్ చేయడానికి వీలుగా రూపొందించిన అణు ముసాయిదాపై సంతకం కూడా చేశారు. అంటే అణ్వస్త్రం కలిగిన ఏ దేశమైనా తమపై దాడి చేసినా లేదా కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అణుయుద్ధం జరిగే అవకాశముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.  

అప్రమత్తమైన ఐరోపా

పుతిన్ నిర్ణయంతో నాటో యుద్ధం మొదలయ్యే అవకాముండటంతో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపిల్లలకు ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీరు నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా లిథువేనియా ఫిన్లాండ్ మధ్య సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపోవడం వెనుక రష్యా హస్తముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు బైడెన్ నిర్ణయం గేమ్ చేంజర్‌గా మారే అవకాముందని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా భూభాగాంలోకి సైనిక స్థావరాలపై దాడితో యుద్ధం త్వరగా ముగుస్తుందని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన ఆరు మిస్సైళ్లలో ఐదింటిని కూల్చేశామని రష్యా తెలిపింది. 

అమెరికాతో హాట్‌లైన్ లేదు: రష్యా

సాధారణంగా రెండు దేశాల అధినేతలు మాట్లాడుకునేందుకు హాట్‌లైన్ వ్యవస్థను ఉపయోగిస్తారు. కానీ అమెరికా, రష్యా మధ్య ఆ వ్యవస్థ ప్రస్తుతం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడుకునేందుకు ఈ వ్యవస్థ ఉండేదని తెలిపారు.