calender_icon.png 24 October, 2024 | 11:48 PM

యూరో విజేత స్పెయిన్

16-07-2024 01:24:37 AM

తుది పోరులో ఇంగ్లండ్‌పై జయకేతనం

ప్రతిష్ఠాత్మక యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో స్పెయిన్ నాలుగోసారి విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన తుదిపోరులో వీరవిహారం చేసిన స్పెయిన్ పుష్కర కాలం తర్వాత యూరో కప్ ఖాతాలో వేసుకోగా.. గత టోర్నీలో ఫైనల్ మెట్టుపై తడబడ్డ ఇంగ్లండ్.. ఈసారి కూడా గెలుపుగీత దాటలేకపోయింది. 

బెర్లిన్: ప్రత్యర్థికి కనీస అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవడమే లక్షంగా పెట్టుకున్న స్పెయిన్ జట్టు.. నాలుగోసారి యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటక జరిగిన యూరో కప్ ఫైనల్లో స్పెయిన్ 2 ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. స్పెయిన్ తరఫున నికో విలియమ్స్ (47వ నిమిషంలో), మైఖేల్ ఓయర్‌జబల్ (86వ ని.లో) చెరో గోల్ కొట్టగా.. ఇంగ్లండ్ తరఫున కోల్ పాల్మర్ (73వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.

యూరోపియన్ టైటిల్ నెగ్గేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఫైనల్‌కు ముందు చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్ కేన్.. అందుకు తగ్గట్లే మైదానంలో వంద శాతం ప్రదర్శన కనబర్చినా.. స్పెయిన్ దూకుడు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్ల పప్పులు ఉడకలేదు. టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా భారీ స్కోర్లతో చిత్తుచేసిన స్పెయిన్ తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. స్పెయిన్ నయాసంచలనం లామినె యమాల్.. మైదానంలో పాదరసంలా కదులుతూ సహచరులు ముందుకు సాగడంలో సహకరించాడు. గత యూరో కప్ ఫైనల్లో ఇటలీ చేతిలో షూటౌట్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్.. ఈసారి కూడా ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకుంది.