calender_icon.png 14 January, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీతీ (నిరసన) ఆయోగ్

28-07-2024 04:14:28 AM

  1. నీతీ ఆయోగ్ భేటీపై నిరసన గళాలు 
  2. ముఖం చాటేసిన నితీశ్ 
  3. సభకు వెళ్లీ అవమానపడ్డానన్న మమత 
  4. బహిష్కరించిన సీఎం రేవంత్ 
  5. విపక్ష రాష్ట్రాల తిరుగుబాటు 
  6. రాష్ట్రాల సహకారంతోనే వికసిత్ భారత్: ప్రధాని

న్యూఢిల్లీ, జూలై 27: దేశానికి దశ, దిశను నిర్ణయించే అత్యంత కీలకమైన నీతి ఆయోగ్ సమావేశాలపై నిరసన గళాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ఈ సమావేశాలు వేదిక అవుతున్నాయి. విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతుందని ఆరోపిస్తూ పలు రాష్ట్రాలు సమావే శాలనే బహిష్కరించగా, కొందరు సీఎంలు బాయ్‌కాట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మిత్రుడు నితీశ్‌కుమార్ కూడా శనివారం నాటి భేటీకి డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. 

ఎన్డీయే భేటీగా నీతి ఆయోగ్ సమావేశం

ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నీతి ఆయోగ్ సమావేశం మొదటిసారి శనివారం దేశ రాజధానిలో జరిగింది. దేశానికి సంబంధించిన అత్యంత కీలక విధాన నిర్ణయాలు తీసుకొనేది ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిలే. దీనికి ప్రధాని చైర్మన్‌గా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. శనివారం 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలపై మోదీ సర్కారు తీవ్ర వివక్ష చూపించిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి ఈ సమావేశాలను బహిష్కరించాలని ముందుగానే తన భాగస్వామ్య పార్టీలను కోరింది. దీంతో తమిళనాడు, కేరళ, జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక తదితర 10 రాష్ట్రాల సీఎంలు ఎవరూ ఈ భేటీకి హాజరుకాలేదు. ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలు మాత్రమే హాజరయ్యారు. అయితే, విపక్ష ఇండియా కూటమికి మద్దతు అంటూనే.. కూటమి మాట మేమెందుకు వినాలని ప్రశ్నించారు. అన్నట్టుగానే సమావేశానికి ఆమె హాజరయ్యారు.

నా మైక్ కట్‌చేశారు: మమత

నీతి ఆయోగ్ భేటీకి హాజరైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలోనే సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తనను అవమానించిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాను మాట్లాడుండగా మైక్ కట్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రాలపై వివక్ష చూపించొద్దని కేంద్రాన్ని కోరాను. నేను మాట్లాడాలనుకొన్నాను. కానీ, నా మైక్ కట్‌చేశారు. నన్ను 5 నమిషాలపాటు మాత్రమే మాట్లాడనిచ్చారు. నాకంటే ముందు మాట్లాడినవారు 10 నిమిషాలు మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుకు 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చి.. నాకు 5 నిమిషాలకే మైక్ కట్‌చేశారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మమత ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. అబద్ధాలను అందంగా అల్లటం మానేసి నిజాలు మాట్లాడితే బాగుంటుందని మమతకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. సమావేశంలో మమత ప్రసంగం ఆడియోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ ట్విట్టర్‌లో విడుదలచేసింది. 

నితీశ్‌కుమార్ డుమ్మా

అత్యంత కీలకమైన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులుగానీ, అధికారులుగానీ హాజరుకాలేదు. బడ్జెట్‌లో తమపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపిస్తూ వారు సమావేశాలను బహిష్కరించారు. విపక్షాల నుంచి మమత ఒక్కరే హాజరయ్యారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ఎవరూ హాజరుకాలేదు. విచిత్రంగా ఎన్డీయే కూటమిలోని ప్రధాన భాగస్వామి, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టారు. ఆయన స్థానంలో సమావేశానికి బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా హాజరయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ ఎందుకు రాలేదన్న అంశంపై జేడీయూ మౌనం వహించటం గమనార్హం. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగా, అదే సమయంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై జేడీయూ నేతలతో నితీశ్‌కుమార్ సమావేశం నిర్వహించటం గమనార్హం. 

భేటీకి రానివాళ్లకే నష్టం

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ తర్వాత సమావేశ నిర్ణయాలను ఆ సంస్థ సీఈవో సుబ్రమణ్యం మీడియాకు వెళ్లడించారు. ఈ సమావేశాలకు కొన్ని రాష్ట్రాలు హాజరుకాకపోవటంపై స్పందిస్తూ.. రాకపోతే వాళ్లకే నష్టమని వ్యాఖ్యానించారు. సమావేశం అద్భుతంగా జరిగిందని, కొన్ని రాష్ట్రాల నుంచి ఎంతో విలువైన సూచనలు వచ్చాయని తెలిపారు. వృద్ధి చోధకాలుగా జిల్లాలు అవతరించాలని ప్రధాని ఆకాంక్షించినట్టు చెప్పారు. మమతాబెనర్జీ ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ‘సమావేశంలో అక్షర క్రమంలో రాష్ట్రాల సీఎంలను మాట్లాడాలని ఆహ్వానించాం. మొదట ఏపీ సీఎం మాట్లాడారు. ఒక్కో సీఎంకు ఏడు నిమిషాల సమయం ఇచ్చాం. తెరపై ఏడు నిమిషాల నుంచి జీరోకు సమయం చూపిస్తుంది. మమత మాట్లాడేటప్పుడు కూడా అలాగే జరిగింది’ అని వివరించారు.   

రాష్ట్రాల సహకారంతోనే వికసిత్ భారత్ : మోదీ

రాష్ట్రాలు సహకరిస్తేనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్న వికసిత్ భారత్ లక్ష్యం సాధించగలమని ప్రధాని మోదీ అన్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనం సరైన మార్గంలో వెళ్తున్నాం. శతాబ్దంలో ఒకసారి వచ్చే మహమ్మారి (కరోనా)ను విజయవంతంగా ఓడించాం. మన ప్రజలు సంపూర్ణ విశ్వాసం, ఆసక్తితో ఉన్నారు. అన్ని రాష్ట్రాల సహకారంతో మనం వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించగలం. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి ఆశయం. రాష్ట్రాలు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ లక్ష్య సాధనలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించగలవు’ అని పేర్కొన్నారు.