calender_icon.png 27 September, 2024 | 6:59 AM

ఆత్మ దర్శనంతోనే శాశ్వతత్వం

27-09-2024 12:00:00 AM

“నచికేతా! నిత్య జీవితం ఒక సహజ వేదిక. అదొక నిత్య యజ్ఞకుండం. అదొక పరుచుకున్న విశాల విస్తృత యజ్ఞశాల. పదార్థంగా కంటికి కనిపిస్తున్నదంతా బ్రహ్మమే! మనసుకు తోస్తున్నదీ బ్రహ్మమే! అనుభవం, అనుభూతీ బ్రహ్మమే! స్తబ్దంగా ఉండకు. చైతన్య ప్రవాహంగా ముందుకు సాగు. శాస్త్రం, కళలు, ప్రతిభ, కవిత్వం, పాండిత్యం వంటి భావనా ప్రపంచం నుండి మనసును పైస్థాయికి నడిపించు. సద్గురువుకై తపించు. ఆయనను ఆశ్రయించు. సాలోక్య, సామీప్య, సాన్నిధ్య స్థితులలో ఆయన బోధనను ఆలకించు, ఆలపించు, ఆలోచించు, ఆచరించు. మనసును, బుద్ధిని, చిత్తాన్ని శక్తివంతం చేసుకో. ప్రతి కర్మను బ్రహ్మార్పణం చెయ్. విశాల బుద్ధిని పదునెక్కించు.

సంపదను సత్కర్మలకై వినియోగించు. జ్ఞానాన్ని పంచిపెట్టు. సంశయాన్ని, సందేహాన్ని, సందిగ్ధతను విడిచిపెట్టు. ఆకాశం వలె మనసును శూన్యం చెయ్. కర్మేంద్రియాలను ఆత్మవైపు మరల్చు. వదులుకోవటం, వదుల్చుకోవటం అలవాటు చేసుకో! నింపటం ఆపి ఒంపటం నేర్చుకో. త్యాగబుద్ధిని అనుసరించి, ఆనంద బిందువులను అందుకో!

అంతే కాదు, నచికేతా! సమత్వాన్ని సాధించుకో! సమన్వయం అన్ని వేళలా సమర్థనీయం. భేదమోదాలకు, ద్వంద్వాలకు అతీతంగా సంచరించు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటం ప్రారంభించు. సంయోగంలో వియోగాన్ని, వియోగంలో సంయోగాన్ని, సమూహంలో ఏకాంతాన్ని, ఏకాంతంలో సమూహాన్ని సృష్టించుకో. భయాన్ని విడిచిపెట్టు. ధీర, వీర, గంభీర చిత్తాన్ని సాధించు. ద్వేషాన్ని వీడు. తమస్సును ఛేదించు. రాజసాన్ని భేదించు. సత్యాన్ని స్వభావంగా మార్చుకో.

దేహం జడం! స్థూలంగా కనిపిస్తున్న ఆ దేహం మాత్రమే నీవు కాదు. నీవు చైతన్యానివి. నీవు శక్తివి. నీవు నిర్ణాయకుడివి. బ్రహ్మజ్ఞానమే అచ్చ తెలివి. తరగని ఆత్మశక్తే నీ దేహాన్ని నడిపిస్తున్నది, ఆడిస్తున్నది. అనేకంలో ఏకత్వాన్ని దర్శించగల గుణమే సత్వం. అదే నీవు! ఒక వస్తువును సమగ్రంగా చూడటం తామసం. దానిని వదిలిపెట్టు. అది అజ్ఞానపు లోగిలి. పగిలిన గాజు పెంకులలో వేల సూర్యులను చూడటం రాజసమే! నిజానికి సూర్యుడు ఒక్కడే అన్నదే జ్ఞానం. ఆ మార్గంలో బుద్ధిని నడిపించు. చూడటం ఆపి దర్శించటం నేర్చుకో. చూడటం భౌతికం! దర్శించటం ఆంతరంగికం.

మరణానంతరమూ జీవించే ప్రయత్నం చెయ్. అటువంటి జీవితం ఒక గొప్ప స్మృతిగా, తలపుగా, చల్లని భావనగా ఉంటుంది. నిద్రించి ఉండగా, మరణ సమానమైన భావం ఏ విధంగా హాయినిస్తున్నదో, ఆ విధంగానే మరణించిన తర్వాత సైతం నీవు నిత్యస్మరణీయుడివి కావాలి. ఇదీ శాశ్వతత్వమే. దీనిని సాధించటానికి నిత్య జీవితాన్ని అధ్యాత్మమయం చేయ్. జాగ్రత్, నిద్ర, సుషుప్తి అనబడే మూడు అవస్థలలోనూ ఆత్మ ఉన్నది, నిశ్చలంగా! అదే నీవు. నచికేతా! ఇదే మృత్యుంజయ భావన! దేహం మృత్యుపరం, ఇది అనివార్యం! ఆత్మ మృత్యువు నెరగదు, ఇదే సత్యం!...” సమవర్తి ప్రవాహ వేగంతో వివరిస్తున్నాడు. నచికేతనుడి ఆత్మ సంస్థితమవుతున్నది, పరమ చరమ స్థితిని తెలుసుకోవాలని!

- వి.యస్.ఆర్.మూర్తి