05-03-2025 12:06:18 AM
పటాన్ చెరు, మార్చి 4 : ఇంద్రేశం శివారులోని ఓఆర్‌ఆర్ నుంచి పెద్దకంజర్ల- శివనగర్ పరిధి వరకు రోడ్డు మొత్తం ధ్వంసం అయ్యింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్ప డి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రోజు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు జరిపే వారి వెన్నుపూసలు కదులుతున్నాయి. నడుము నొప్పులతో ఆసుప త్రుల పాలు అవుతున్నారు. నిత్యం ఈ రోడ్డుపై తిరిగే వారు గుంతల కారణంగా హూనం అవుతున్నారు.
బైకులు, కార్లు తరుచూ రిపేర్లకు వెళుతున్నాయి. బస్సులు, ఆటోల పరిస్థితి ఇంతే. గుంతల కారణంగా శివనగర్ గ్రామానికి వచ్చే బస్సులు పూర్తిగా తగ్గాయి. దీనికి తోడు రాళ్లకత్వ, సోలక్పల్లి, కంజర్ల-శివనగర్ గ్రామాల పరిధిలో ఉన్న కంకర క్రషర్ టిప్పర్లు రాత్రింబవళ్లు అధిక లోడుతో తిరుగుతుండడంతో రోడ్ల దుస్థితి మరింత అధ్వానంగా మారింది. చాలా వరకు ఇంద్రేశం నుంచి శివనగర్, సోలక్పల్లి గ్రామాలకు వచ్చే వారు, పటాన్ చెరు వైపు వెళ్లే వారు మరో దారిని ఎంచుకుంటున్నారు.
శివనగర్ గ్రామస్తులు పటాన్ చెరు లో వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తుంటారు. దీని కోసం ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతుంటారు. రోడ్డు పూర్తిగా ధ్వసం కావడంతో శివనగర్ ఎల్‌ఈడీ పార్కు నుంచి కొడకంచి చౌరస్తా, వీకర్ సెక్షన్ మీదుగా వెళుతున్నారు. పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల, అండూరు, శివనగర్, సోలక్ పల్లి గ్రామస్తులు పటాన్ చెరుకు ఎక్కువగా రాకపోకలు చేస్తుంటారు. రోడ్డు దుస్థితి కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం మారాయి.
రూ.22.50 కోట్లు క్యాన్సిల్
పటాన్ చెరు శివారులోని ఓఆర్‌ఆర్ నుంచి పెద్ద కంజర్ల-శివనగర్ పరిధి వరకు నాలుగు వరుసల రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.22.50 కోట్లు మంజూరు చేసింది. అగ్రిమెంట్ కూడా జరిగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కంజర్ల శివారులో దాదాపు పదహారు నెలల క్రితం నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు.
అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. పటాన్ చెరు ఎమ్మెల్యేగా అప్పడు బీఆర్‌ఎస్ నుంచి మహిపాల్ రెడ్డి గెలవడంతో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది.
దీంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం జరుగుతుందని సంతోషించిన ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. సమస్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నారు.
రోడ్డు మరమత్తుల కోసం రూ.45 లక్షలు
ఓఆర్ ఆర్ నుంచి పెద్ద కంజర్ల పరిధి వరకు ఆర్‌అండ్బీ రోడ్డు మరమత్తుల కోసం రూ.45లక్షలకు ప్రపోజల్స్ పంపించాము. నిధులు మంజూరు దశలో ఉన్నాయి. నిధులు మంజూరు కాగానే రోడ్డు మరమత్తు పనులు చేపడుతాము. గతంలో నాలుగు వరుసల రోడ్డు కోసం మంజూరైన నిధులు క్యాన్సిల్ అయ్యాయి.
రామక్రిష్ణ, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ డీఈ