calender_icon.png 27 September, 2024 | 12:58 PM

ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల ఏర్పాటు

27-09-2024 01:38:13 AM

  1. యువత భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు
  2. రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): యువత భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించా రు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంఎస్‌ఎంఈ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పీఎంకేవీవై 4.0 పథకం కింద యూసఫ్‌గూడలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్య క్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్ది, యువకులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఆ దిశగా పలు చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో పీపీపీ తరహాలో స్కిల్ యూనివర్సిటీని స్థాపించినట్టు పేర్కొన్నారు.

దీని ద్వారా వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే 17 రకాల సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను ఏర్పాటు చేసిందని, ఉద్యోగకల్పనే లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలు రూపకల్పన చేస్తామన్నారు. తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పదేళ్లకుగానూ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. గత పదేండ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందగా, ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రూ.2,324 కోట్ల వ్యయంతో ఐటీఐలను ఏటీసీలుగా మార్చబోతున్నట్టు తెలిపారు.