05-04-2025 02:08:53 AM
తూప్రాన్‌లో ట్రామా కేంద్రం ఏర్పాటు
సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గించాలి
మంత్రి దామోదర రాజనర్సింహ
తూప్రాన్/నర్సాపూర్/మెదక్, ఏప్రిల్ 4(విజయక్రాంతి)రాష్ట్ర వ్యాప్తంగా రీజినల్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని, జాతీయ రహదారులపై ట్రామా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ తెలిపారు. శుక్రవారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్ ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి జిల్లా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తూప్రాన్ లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల రోగులకు మంచి జరుగు తుందన్నారు.
వైద్య వృత్తి చాలా పవిత్రమైనదన్నారు.ప్రభుత్వ ధవాఖనలు ప్రైవేటు ఆసుపత్రిలకంటే దీటుగా ఉండాలన్నారు. రాష్ట్రం లో 7,500 ట్రామా కేంద్రాల ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. ఆసుపత్రి వాతావరణం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వైద్యం జరగాలన్నారు. ఈ సెక్షన్ ఆపరేషన్లు తగ్గించారని ఇంకా కూడా తగ్గాలని వైద్యులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రీజినల్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దృష్టి సాధించమన్నారు. రోగులను డాక్టర్లు కస్టమర్లుగా ట్రీట్ చేయాలన్నారు. రోగులను ఏ సందర్భంలోనైనా ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించవద్దని అధికారులకు సూచించారు. ఇంకేదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారం ఆదేశించారు.
తూ ఫ్రాన్ ఆసుపత్రిలో 5 డయాలసిస్ యూనిట్స్ నెలకొల్పినట్టు, రూ.80 లక్షల వ్యయంతో నెలకొల్పడం జరిగిందని సిబ్బంది నియామక విషయంలో ముగ్గురు టెక్నీషియన్స్, స్టాఫ్ నర్స్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ తో ప్రతిరోజు 20 మందికి డయాలసిస్ సేవలు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డి సి హెచ్ ఓ శివ దయాల్, మెడికల్ సూపర్డెంట్ అమర్ సింగ్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట ఆసుపత్రి సూపరిండెంట్లుపాల్గొన్నారు.
పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయం:నర్సాపూర్లో సన్న బియ్యం పంపిణీ చేసిన మంత్రి
నర్సాపూర్ నియోజక వర్గ కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన కళ్యాణలక్మి, షాదిముబారాక్,
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దారిద్య రేఖకు దిగునున్న రేషన్ కార్డు కలిగిన పేదవారికి సన్న బియ్యం పంపిణీ చేసి వారి కడుపు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపుల ద్వారా 2,13,828 రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం 4430.496 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని, దీని ద్వారా 6 లక్షల 96 వేల 043 మంది సభ్యులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములతో పాటు క్యారక్టర్ ముఖ్యమని స్పష్టం చేశారు. రాబోయే కాలం లో ప్రతి వ్యక్తి విద్యా వంతుడు, సంస్కార వంతుడు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నర్సాపూర్ కు ట్రామా, సీ టి స్కాన్ సెంటర్, ఇంటి గ్రేటెడ్ స్కూల్ ను త్వరలో ప్రారంభం చేయనున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా సేవ చేసినప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంచేందుకు మంత్రి సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు.
జక్కపల్లిలో 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, చిల్పిచేడు మాసాయిపేట నూతన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, మెదక్ గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యక ర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య...
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య, సమపాళ్లలో మెనూ అందించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తూప్రాన్ టోల్ గేట్ దగ్గర ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ బాలుర పాఠశాలలో మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెనూ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా సామర్ధ్యాలను, ప్రశ్నలతో, జవాబులతో పరీక్షించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, పాఠశాలల్లో వసతులు సరిగా ఉన్నాయా సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ , ప్రిన్సిపల్ మురళి,ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులుపాల్గొన్నారు.