ఓయూ జేఏసీ నాయకులు మోతిలాల్ నాయక్
ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన
హైదరాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటే ఇల్లు ఇచ్చేది, భూములు పంచేది అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేద గిరిజనుల భూములను బలవంతంగా లాక్కుంటుందని, పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఓయూ జేఏసీ నాయకులు మోతిలాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో అమాయక గిరిజనులపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో నిర్బంధించటానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ.. లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఫార్మా కంపెనీ కోసం లంబాడా గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయం అన్నారు. ఫార్మా కంపెనీ ఏమైనా ప్రభుత్వ ప్రాజెక్టా అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే రెడ్ల భూములను ఇవ్వాలని అన్నారు. ఈ ఘటనలో 90 సంవత్సరాల మహిళపై కూడా దాడి చేయడం ఏమైనా చర్య అని అన్నారు. రాష్ట్రంలో తక్షణమే ఫార్మా కంపెనీలను రద్దు చేయాలి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 12 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మంత్రిగా ఉన్న సీతక్క ఇటీవల చెంచులపై జరిగిన దాడి ఘటనలో బాధితులను పరామర్శించి లగచర్లలో లంబాడాలపై ప్రభుత్వం, పోలీసులు జరిపిన దాడిని నిరసించకపోవడాన్ని మోతిలాల్ నాయక్ తప్పుపట్టారు. లగచర్లలో ఫార్మా కంపెనీలకు భూములు లాక్కోవడాన్ని ఉపసంహరించుకోవాలని, లంబాడాలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో తగిన సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యావత్తు దేశమంతా లగచర్ల వైపు చూసేలా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.