calender_icon.png 19 April, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో రుణ మాఫీ రైతుల జాబితా ఫ్లెక్సీల ఏర్పాటు

12-04-2025 01:16:50 AM

ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వ చర్యలు

మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ పొందిన రైతుల పేర్లతో కూడిన ఫ్లెక్సీలను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేయిస్తోంది. రుణమాఫీ పథకం పై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో భాగంగా రుణ మాఫీ పొందిన రైతుల పేర్లను వెల్లడిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రుణమాఫీ పొందిన రైతుల జాబితాలను ఫ్లెక్సీలో ముద్రించేందుకు ప్రత్యేకంగా టెండర్ నిర్వహించి ఆ మేరకు ముద్రించిన ఫ్లెక్సీలను గ్రామాల్లో ఏర్పాటు చేయిస్తున్నారు.  ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంతో ప్రభుత్వానికి హా మేరకు ఆశించిన మేర ప్రచారం లభించడం లేదని తలపోస్తోందని ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం ద్వారా ఇప్పటికే అమలు చేస్తున్న 200 యూనిట్ల లోపు గృహ జ్యోతి, 500 కు గ్యాస్ సిలిండర్, వివిధ రకాల పింఛన్లు, మహాలక్ష్మి, సన్న వడ్లకు బోనస్, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రదర్శించనున్నట్లు సమాచారం.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులను కార్యరంగంలోకి దింపడానికి అధిష్టానం చర్యలు చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇకనుండి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించడంతోపాటు లబ్ధిదారుల ఎంపిక కూడా అదే తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రుణమాఫీ పొందిన రైతుల జాబితాలను గ్రామాల్లో ప్రదర్శించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.