18-03-2025 12:46:08 AM
కేంద్ర మంత్రి సంజయ్ ని కోరిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, మార్చి 17: వికారాబాద్ లో ఎన్సీసీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. సోమవారం న్యూఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్సీసీ యూనిట్ తో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
దేశభక్తి పెంపొందడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మేరకు జూలై నెల 2024 లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. వికారాబాద్ మునిసిపల్ పరిధిలో అనంత పద్మనాభ స్వామి కళాశాల భవనం లో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి కళాశాల యాజమాన్యం కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అంతేకాదు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాసిందని తెలిపారు. దీంతో కేంద్ర రక్షణ శాఖ సహాయ సానుకూలంగా స్పందించారు.