- అభివృద్ధికి పటిష్ఠ ప్రణాళికలు
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, జనవరి 7 (విజయక్రాంతి): ఇండియా టూరిజం మ్యాపులో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం కల్పించేలా మండల అభివృద్ధికి పటిష్ఠ ప్రణాళికలు తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఆయన పర్యటించారు. పలు రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
జీపీలు, ఆరోగ్య ఉప కేంద్రా భవనాలను ప్రారంభించారు. జమలాపురం అటవీ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చాలా సంవత్సరాల నుంచి జమలాపురం దేవాలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజలు ఆకాంక్షించారని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జమలాపురం చెరువు, పక్కన కాటేజ్ కోసం పర్యాటక శాఖచే ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు.
ఆరు నెలల్లో అటవీ పార్క్ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని అధికారులను భట్టి ఆదేశించారు. బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి వెళ్లే మార్గంలో ఇద్రీనమ్మ చెరువు కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ, నాగార్జునసాగర్ నుంచి లింక్ చేసి, అక్కడ ఎప్పుడూ నీళ్లు ఉండే విధంగా చూస్తామన్నారు. కాటేజ్, పార్క్, భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ పీ శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, డీపీవో ఆశాలత పాల్గొన్నారు.