calender_icon.png 20 November, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ ‘ఫైనల్ కీ’లో తప్పులు!

10-09-2024 03:06:05 AM

  1. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు 
  2. డీఎస్‌ఈ కార్యాలయానికి భారీగా తరలొచ్చి ఆందోళన 
  3. కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లలో సమాధానాలే లేవని ఆవేదన 
  4. తమకు మార్కులు కలపాల్సిందేనని వినతి 
  5. రివైజ్డ్ కీ విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): డీఎస్సీ పరీక్షల నిర్వహణ అంతా గందరగోళంగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. పరీక్ష ప్రాథమిక కీ, తుది కీ లో అనేక తప్పులు దొర్లినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 13న ప్రాథమిక కీ 28,500 అభ్యంతరాలు వెల్లువెత్తగా, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ఈనెల 6న ఫైనల్ కీ విడుదల చేసింది. తుది కీ లోనూ భారీగా తప్పులు దొర్లినట్లు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు తప్పుడు సమా ధానాలు ప్రకటించినట్లు విమర్శిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకైతే ఆప్షన్లలో సమాధానాలే లేవంటున్నారు. జూలై 23న ఉదయం సెషన్‌లో జరిగిన ఎస్జీటీ పరీక్షా ప్రశ్నాపత్రంలో 53, 124వ ప్రశ్నలను పరిశీలిస్తే...

ప్రశ్న 53: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు?

ఆప్షన్లు: 1).ఏకాదేశం 2).ఆదేశం 3).బహుళం 4).నిత్యం 

తుది కీ ప్రకారం సరైనా సమాధానం ఆప్షన్ 2)ఆదేశం. కానీ కొందరు అభ్యర్థులు మాత్రం సమాధానం ఆప్షన్ 1)ఏకాదేశం అంటున్నారు. ఇదే ప్రశ్న ఈ ఏడాది మే లో నిర్వహించిన టెట్‌లోనూ వచ్చిందని, ఆ కీలో సమాధానం ఏకాదేశం ఉందని ఘం టాపథంగా చెప్తున్నారు. అప్పుడు ‘ఏకాదేశం’ అని సమాధానం కరెక్ట్ అయినప్పుడు.. డీఎస్సీలో మాత్రం ఎందుకు తప్వు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల్లోనూ కరెక్ట్ ఆన్సర్ ‘ఏకాదేశం’ అనే ఉందని స్పష్టం చేశారు.

ప్రశ్న 124: భారత ఉపరాష్ట్రపతి వీరితో ఎన్నుకోబడతారు?

ఆప్షన్లు: 1).పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు

2).అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు

3).లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే

4). అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు

ఫైనల్ కీ ప్రకారం సరైనా సమాధానం ఆప్షన్ 1).పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన లేదా నామినేట్ చేయబడిన సభ్యులు. కానీ కొందరు అభ్యర్థులు మాత్రం సరైన జవాబు ఆప్షన్ 3).అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు.. అని చెప్తున్నారు. పుస్తకాల్లోనూ ఇదే జవాబు ఉందని ఆధారాలను చూపిస్తున్నారు. ఇలా ప్రతి సెషన్‌లోనూ కొన్ని ప్రశ్నలకు సరైనా సమాధానాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించి, తమకు న్యాయం చేయాలని సోమవారం రాష్ట్ర నలుమూలల నుంచి సైదాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. జూలై 22, 23న నిర్వహించిన మొదటి సెషన్ ఎస్జీటీ పరీక్షలతోపాటు మరికొన్ని సెషన్లలో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించిన సమాధానాల్లో తప్పులు దొర్లాయని అధికారుల ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. తుది కీ ని పునఃపరిశీలించి సరైనా సమాధానాలను గుర్తించి తమకు మార్కులు కలపాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

ఆలస్యం కానున్న డీఎస్సీ ఫలితాలు...

డీఎస్సీ ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని, పాఠ్యపుస్తకాల ప్రకారం సమాధానాలు ఫైనల్ కీలో ఇవ్వలేదని అభ్యర్థులు వాపోయారు. ఇలా తప్పులు దొర్లడం ద్వారా ఒక్కో అభ్యర్థి రెండు నుంచి నాలుగు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ అర మార్కుల తేడాతోనే వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు పోగొట్టుకుంటారని, ప్రశ్నలు ఇచ్చిన నిపుణుల తప్పిదాలకు తామెందుకు నష్టపోవాలని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులు ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మరోక సారి సబ్జెక్టు నిపుణుల కమిటీకి ఆధారాలు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఒకవేళ తప్పులు నిజంగానే దొర్లాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే.. మళ్లీ రివైజ్డ్ కీ ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీఎస్సీలో వచ్చిన మార్కులు, టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్‌ఎల్) విడుదల చేయాల్సి ఉంటుంది. అనంతరం 1:3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అభ్యర్థులకు మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేయాలి. అయితే తుది కీ లో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఈ ప్రక్రియంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కమిటీ మరోసారి అభ్యర్థుల అభ్యంతరాలపై పునః పరిశీలించాల్సి ఉంది. ఇక తర్వాత జీఆర్‌ఎల్, 1:3 జాబితా, 1:1 జాబితా విడుదల కానున్నది.