దాదాపు 800 సంవత్సరాల క్రితం మాగ్నాకార్టా రూపంలో మానవులకు ప్రసాదించిన మానవ హక్కులు నేటికీ అందరికీ సమానంగా అందుబాటులోకి రాలేదని చెప్పటం ఎంతో బాధాకరం. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఏదో ఒక రూపంలో వ్యక్తులు, సమాజం, ప్రభుత్వాలు, పాలకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ధ్యేయంతో అందరికీ సమానంగా హక్కులు అందించడంలో వివక్షను ప్రదర్శిస్తున్నారు. కొన్ని దేశాలకు చెందిన ప్రాంతాల్లో జాతి, మత, కుల, లింగ అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఫలితంగా ఉద్రిక్తతలు, అసమానతలు, యుద్ధాలు, అసాంఘిక కార్యకలాపాలు, దాడులు, దోపిడీలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు తప్పడం లేదు. ఈ పరిస్థితి మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నది. వివక్షకు గురవుతున్న వారు ఉగ్రవాదులుగా మారి ప్రపంచంలో పలు ప్రాంతాల్లో మారణకాండకు దిగుతున్నారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్య ధోరణులు ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తరచూ కారణమవుతున్నాయి. శాంతిచర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. అయినా, ఐక్యరాజ్యసమితి సూచనలనైనా పరిగణనలోకి తీసుకోకుండా యుద్ధాలతోనే సమస్యలకు పరిష్కారం అన్నట్టుగా ఆయా దేశాధినేతలు వ్యవహరిస్తున్నారు.
అనేక అగ్ర దేశాలు యుద్ధాలకు కారణమవుతూ ఎందరో పిల్లలు, మహిళలు, ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి. రష్యాపై నాటో సహకారంతో ముఖ్యంగా అమెరికా అండదండలతో ఉక్రెయిన్, అలాగే అమెరికా అండదండలతో ఇజ్రాయెల్.. పాలస్తీనా, గాజాపై చేస్తున్న యుద్ధాలలో నేటికీ అనేక లక్షలమంది మరణించడం, మరెందరో అణిచివేత, ఆక్రందనలకు గురవడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొనవచ్చు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మహిళలు, పిల్లలపై జరుగుతున్న వివక్షలు, దాడులు మానవ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
మన దేశంలో స్త్రీలపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న వివక్షలు, దాడులు ఇటీవలి కాలంలో అందరం ప్రత్యక్షంగా చూస్తునే ఉన్నాం. గతేడాది కాలంగా మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు మనతోపాటు ప్రపంచ దేశాలనూ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అయినప్పటికీ దేశ ప్రధాని ఒక్కసారైనా ఆ ప్రాంతాన్ని సందర్శించక పోవడం బాధాకరం. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతు న్నాయి.
ముఖ్యంగా గ్రృహహింస పెరుగుతుంది. బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. అనేక మంది అకాల మరణాలు చెందుతున్నారు. ప్రశ్నించే వారి గొంతులను అరికడుతున్నారు. అందరికీ అందవలసిన ప్రకృతి వనరులు కొందరి కనుసన్నల్లో ఉండుట గమనార్హం. సంపద కేంద్రీకృతమై దేశంలో అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక సామాజిక రాజకీయ అంతరాలు దొంతరలుగా పెరుగుతున్నాయి.
నేటి ఆధునిక యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందటం ద్వారా రకరకాల సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలు, యువత సెల్‌ఫోన్, టీవీలు కంప్యూటర్లు లాప్‌టాప్, టాబ్లెట్ వంటి అనేక సాధనాలు వాడటం, ఇంటర్నెట్, ఆన్‌లైన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో మంచి విషయాలకంటే చెడు అంశాలను నేర్చుకుంటూ, అనేక అసాంఘిక కార్యకలాపాలకు కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దేశంలో పదహారు సంవత్సరాల లోపు పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే విధంగా చట్టం చేయడం మంచి పరిణామం.
మన లాంటి దేశంలో కూడా ఈ విధానం రావాలని అని కోరుకుందాం. మన సమాజంలోనూ గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాలు అంతరించి, చిన్న కుటుంబాలు పెరగడం, తల్లిదండ్రులు ఉద్యోగ ఉపాధి విషయాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పిల్లలతో కలిసిమెలిసి ఉండే అవకాశం లేకుండా పోయింది. పిల్లలు ఇంటర్నెట్ ఆన్‌లైన్ గేమ్స్‌కు, చెడు వ్యసనాలకు లోనవుతూ, మద్యం మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. హింసా ప్రవృత్తి, అఘాయిత్యాలకు ఆస్కారమేర్పడుతున్నది. నైతికత, మానవత్వాలను మరచి హింసా ప్రవృత్తిని చేపడుతున్నారు. ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానవీయ విలువలు నేర్పాలి. మంచి పౌరులుగా తీర్చి దిద్దాలి.
సర్వేజనాః సుఖినోభవంతు!
ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న మానవ హక్కు ల ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కుటుంబ స్థాయినుంచి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. అన్ని వర్గాల ప్రజలను సమానదృష్టితో చూడాలి. జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, నెల్సన్ మండేలా వంటి సామాజిక ఉద్యమకారులు ఆశయాలు, జీవిత లక్ష్యా లు అందరూ అమలు చేయాలి. ఐక్యరాజ్యసమితి సూచనలు, సలహాలనూ అన్ని దేశాలు పాటించాలి. ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం కోసం పాటుపడాలి. కులమత, జాతివర్ణ, లింగ వివక్షలు విడనా డాలి. అందరికీ విద్య వైద్యం అందించాలి.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే మానవుల్లో మంచితనం పెరిగి, మానవత్వంతో ముందుకు సాగడం సాధ్యమవుతుం ది. రాచరికం, సైనిక, నిరంకుశ పాలనలు ఉన్న దేశాల్లోనేకాక ప్రజాస్వామ్య వ్యవస్థ అముల్లో ఉన్న దేశా ల్లోనూ వివిధ రూపాల్లో వివక్షలు కొనసాగుతుండడం విచారకరం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగరాదు. నీతి నిజాయితీ, సత్యం, అహింస, సౌభాత్రృత్వం, సమానత్వం వంటి అంశాలపైనే భవిష్యత్తు సమాజం ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది ‘అవర్ రైట్స్, అవర్ ఫ్యూచర్, రైట్ నౌ’ అనే ఇతివృత్తంతో ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దృష్టితో ‘సర్వే జనా సుఖినోభవంతు’ అనే నానుడిని అందరం కలిసి నిజం చేద్దాం.
ఐ.ప్రసాదరావు