- జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన
- కాంగ్రెస్‌లో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు
- సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
రాజేంద్రనగర్, నవంబర్ 2: కులగణనతోనే అందరికీ సమన్యాయం జరుగుతుం దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో డీసీసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కులగణన సన్నాహక సమావేశా నికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం కులగణనను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ ఆలోచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టేందుకు సర్వే చేపడుతున్నామన్నారు. ఈ సర్వే ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
సర్వేలో 56 అంశాలను ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు, గుర్తింపు వచ్చిందని చెప్పారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు కులగణనపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
పదవులు రానివారికి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా న్యాయం చేయాలనే విషయం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొ న్నారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, అఖండ విజయం సాధిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాలు మారినా వెనుకబడిన వర్గాల స్థితిగతులు మారలేదని, వారిని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాహుల్‌గాంధీ కులగణన హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలోనే సీఎం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కులగణన అనేది సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ఎంతో సాహసోపేతమైన, గొప్ప నిర్ణయమని కొనియాడారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డితో పాటు చిలుకా మధుసూదన్ రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, పామెన భీంభరత్, రామ్మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.