calender_icon.png 19 April, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29 నుంచి ఎప్‌సెట్

19-04-2025 01:49:48 AM

  1. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్
  2. పరీక్షా కేంద్రానికి రూట్‌మ్యాప్
  3. నిమిషం నిబంధన అమలు
  4. నేటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
  5. అడ్మిషన్లలో వర్గీకరణ అమలు

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చ ర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎప్‌సెట్‌కు హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈనెల 29 నుంచి మే 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి కూడా నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు.

పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జేఎన్‌టీయూ యూనివర్సిటీ, తెలం గాణ ఉన్నత విద్యామండలి అధికారులు శుక్రవారం వర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వర్సిటీ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి, విద్యామండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఎప్‌సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కోకన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు హాల్‌టికెట్లు, 22 నుంచి ఇంజినీ రింగ్ అభ్యర్థుల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ మొబైల్ సహాయంతో కోడ్‌ను స్కాన్ చేసి రూట్‌మ్యాప్ ద్వారా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపారు.

అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఈ నెల 29, 30 తేదీల్లో జరుగనుంది. ఏప్రిల్ 29న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. ఇక ఈ నెల 30న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

ఇంజినీరింగ్ పరీక్షను మే 2 నుంచి 4 వరకు నిర్వహిస్తారు. రోజూ రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు నిర్వహిస్తారు. 

ఎస్సీ వర్గీకరణ అమలు..

ఇక అగ్రికల్చర్ ఫార్మసీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 112 కేంద్రాలు, ఇంజినీరింగ్ కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్‌కు 86,101 మంది, రెండు పరీక్షలకు 253 మంది దరఖాస్తు చేసున్నారు. అయితే ఈసారి గతంలో కంటే దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. 2024లో 3,54,803 దరఖాస్తులు రాగా, ఈసారి 3,05,774 వచ్చాయి.

ఉమ్మడి ఏపీ విభజన కోటా ఈ ఏడాదితో ముగియడంతో ఏపీ విద్యార్థులకు ప్రత్యేక కోటా లేదు. ఈక్రమంలోనే దరఖాస్తులు సుమారు 50 వేల వరకు తగ్గాయి. అంతేగాక ఈసారి ఎప్‌సెట్ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

పరీక్ష మధ్యలో ఎక్కడైనా సెంటర్‌లో పొరపా టుగా ఏమైనా సాంకేతిక సమస్యలొచ్చి, పరీక్షకు అంతరాయం ఏర్పడితే అక్కడిక్కడే ఆ సమస్యను పరిష్కరించి తిరిగి పరీక్ష రాయిస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈసారి ఇంజినీరింగ్‌లో సీట్లను పెంచడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఫాక్ట్ ఫైండింగ్ కమిటీల ద్వారా కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

అభ్యర్థులు పాటించాల్సినవి

ఉదయం సెషన్ వారికి 7.30 గంటలకు, మధ్యా హ్నం సెషన్ వారికి 1.30 గంట నుంచి కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. అభ్యర్థులు సెంటర్‌కు సమయానికి చేరుకునేలా ఒకరోజు ముందే పరీక్షాకేంద్రాన్ని సరిచూసుకోవాలని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఉండటంతో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకుంటారు.

చేతులపై మెహందీ, టాటూ, ఇంక్ మొదలైన డిజైన్లు ఉండకూడదు. చెల్లుబాటయ్యే ఫొటో ఐడీ, హాల్‌టికెట్, బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్‌ను వెంట తీసుకెళ్లాలి. క్యాలుకులేటర్లు, సెల్‌ఫోన్లు, పేజర్లు, లాగ్ టేబుల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు తీసుకెళ్లొద్దు. పరీక్ష ముగిసే వరకు బయటకు అనుమతి ఉండదు.