త్వరలోనే కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: వేతన జీవులకు కేంద్రం త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పే అవకాశాలు కన్పిస్తు న్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచా రం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ’ఎకనామిక్ టైమ్స్’ కథనం రాసింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ. 15వేలు ఉండగా.. దాన్ని రూ.21వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.ఇక, దీంతో పాటు ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది.
ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓలో చేరాల్సిఉండగా.. ఈ సంఖ్యను 10 -15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను చిన్న-మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ. 6,500గా ఉన్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది.
సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో.. మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది.