ముంబై, డిసెంబర్ 25: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో ఈ ఏడాది అక్టోబర్ నెలలో నికరంగా 13.41లక్షల మంది సభ్యులు జతయ్యారు. గతంలో ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు కూడా వీరిలో ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో 7.50 లక్షలమంది కొత్త సభ్యులు చేరారు. కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసిన పేరోల్ డాటా ప్రకారం గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో చేరికలు 16 శాతం పెరిగాయి. కొత్త సభ్యుల్లో 18 ఏండ్ల వయస్సుగల యువ సభ్యులు 58.49 శాతం మంది ఉన్నారు.
అక్టోబర్‌లో 2.09 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు చేరారు. గత ఏడాది ఇదేనెలకంటే వీరి పెరుగుదల 2.12 శాతం ఉన్నది. దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు లభించే ప్రయోజనాల పట్ల అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో కార్యక్రమాల సమర్థత సభ్యత్వ పెంపునకు దోహదపడినట్టు కార్మిక శాఖ తెలిపింది. కొత్త చేరికలు మహారాష్ట్రలో అధికంగా 22.18 శాతం పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వృద్ధి 5 శాతం మేర ఉన్నది.