* ఎకోటూరిజం పాలసీ సిద్ధం
* నోడల్ ఎజెన్సీగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ
* సీఎం పరిశీలన తర్వాత పాలసీ ప్రకటన
హైదరాబాద్, జనవరి 2౪ (విజయక్రాంతి): తెలంగాణను పర్యాటక గమ్యస్థానంగా నిలిపే ఉద్ధేశంతో సర్కారు ప్రత్యేకంగా ‘ఎకో టూరిజం’ పాలసీని తీసుకొస్తోంది. ఇప్పటికే ఐదేళ్ల ప్రణాళికతో టూరిజం విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎకో టూరిజం పాలసీని తీసుకురాబోతోంది. అడవులు, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పాలసీ డ్రాఫ్ట్ రెడీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
నాలుగు లక్ష్యాలతో అటవీశాఖ ఎకో టూరిజం పాలసీని రూపొందించింది. ఎకో సిస్టమ్‌కు వీలైనంత తక్కువ నష్టాన్ని కలిగిస్తూ బాధ్యతాయుతంగా పర్యావరణ టూరిజాన్ని ప్రోత్సహించడం; జీవవైవిధ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం; సామాజిక ఆర్థిక అవకాశాలను కల్పిస్తూ.. పర్యాటక సర్క్యూట్లు, ఎన్విరాన్‌మెంటల్ విద్యను ఎకో టూరిజానికి అనుసంధానం చేయనున్నారు.
స్థానికుల భాగస్వామ్యంతో ఎకో విలేజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణానికి ఆటంకం కలిగించకుండా మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించనుంది. పాలసీ అమలును నోడల్ ఏజెన్సీగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ) పర్యవేక్షించనుంది. అలాగే, కొత్తగా ఎంపిక చేసే ఎకో టూరిజం ప్రదేశాలను అటవీ శాఖ మంత్రి నేతృత్వంలోని ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేయనుంది.
పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం వన్యప్రాణులు నివాసాల అభివృద్ధికి కేటాయించాలని ప్రతిపాదించింది. పర్యావరణ పర్యాటక ప్రమోషన్ కోసం ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్’ బ్రాండిగ్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సర్యూట్లు వారీగా ఎకో టూరిజం పాలసీని ప్రభుత్వం గుర్తించనుంది.
17 సర్క్యూట్లలో 60 టూరిజం స్పాట్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. అవకాశాలను భట్టి కొత్త ప్రదేశాలను ఈ జాబితాలో చేర్చనుంది. పాలసీ ప్రకటించకముందే ప్రభుత్వం ఎకో టూరిజం జోన్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా వికారాబాద్ జిలాల్లోని అనంతగిరి జోన్ దాదాపు రూ.60 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.