calender_icon.png 31 October, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీనామా చేస్తేనే బీజేపీలోకి ఎంట్రీ

08-07-2024 12:26:58 AM

ఈడీ కేసులున్న నేతలకు చేర్చుకోం

కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాల అభివృద్ధికి కృషి

కరీంనగర్ రైల్వే లైన్ సర్వే పూర్తి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్

కరీనంగర్, జగిత్యాల, వరంగల్ హైవే పనులపై సమీక్ష నిర్వహణ

కరీంనగర్, జూలై 7 (విజయక్రాంతి): ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ కేసులన్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశాల్లేవని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని చెప్పారు.

కరీంనగర్ రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలపై రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తయ్యాయన్నారు. విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలున్నా రాజకీయ లబ్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరింత జఠిలం చేసి, నాన్చుతూ వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎం లు సఖ్యతతో ఉన్నారని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పా రు. సీఎంల భేటీని అడ్డం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

ఎమ్మెల్యేలను రాజీనామా చేయించలేదేం?

ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన బాగుంటే ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని సూచించారు. ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయక త్వం చూసుకుంటుందని, కొత్త నేతలకు అధ్యక్ష పద వి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదని బండి సంజ య్ చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతామని, ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్వవహరించారని ఆరోపించారు. పలు రాష్ట్రాలు కోరితేనే స్మార్ట్ సిటీల గడువు పొడిగించామని, రేవంత్‌రెడ్డి అడిగినంత మాత్రాన ఇది జరగలేదన్నారు. గడువు పొడగింపుతో కరీంనగర్‌కు మరిన్ని నిధులు వస్తాయన్నారు. 

జగిత్యాల హైవేపై బండి సమీక్ష

కరీంనగర్ కరీంనగర్ (ఎన్‌హెచ్563) జాతీయ రహదారి విస్తరణ పనులపై బండి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవే నిర్మాణం పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, ఎప్పటివరకు పూర్తవుతాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ హైవే పనులకు 15 రోజుల్లోగా టెండర్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలో కరీంనగర్ రహదారి విస్తరణ పనుల అంశం ఉన్నదని, సెప్టెంబరులోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, పనులను ప్రారంభించే అవకాశాలున్నట్లు వెల్లడించారు. ఈ రహదారికి సంబం ధించి భూసేకరణ ప్రక్రియ 40 శాతం మేరకు పూర్తయ్యిందని తెలిపారు. సుమారు రూ.2,227 కోట్ల అంచనా వ్యయంతో 58 కిలోమీటర్ల మేర చేపట్టే విస్తరణ పనుల్లో భాగంగా 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జిలతోపాటు 195 కల్వర్టులను నిర్మించనున్నట్లు వివరించారు. కరీంనగర్ వరంగల్ హైవే పనులు 37 శాతం పూర్తయ్యాయని, 2025 జూలై నాటికి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయన్నారు.