calender_icon.png 29 December, 2024 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరవైలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా!

23-12-2024 12:00:00 AM

వృద్ధాప్యం వయస్సుకే కానీ.. మనసుకు కాదు అని చాటి చెబుతున్నారు ఈకాలం బామ్మలు. పదునైన ఆలోచనలు, పక్కా ప్రణాళికలతో యూత్‌కు ఏమాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు. రిటైర్‌మెంట్ తర్వాత ఇంటికే పరిమితం కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తున్నారు. అభిరుచినే ఆదాయంగా మలుచుకున్న కొంతమంది బామ్మల గురించి ఈవారం 60 ప్లస్‌లో..

ఒకప్పుడు పదవీ విరమణ తర్వాత మగవారైనా, ఆడవారైనా ఇంటికే పరిమితమై శేష జీవితాన్ని హాయిగా గడిపేవారు. నచ్చిన ప్రదేశాలను చుట్టేస్తూనో, ఆధ్యాత్మిక ప్రపంచంలో నిమగ్నమవుతూనో జీవితాలను వెళ్లదీసేవారు. కానీ ఈతరం అమ్మమ్మలు, నానమ్మలు... రిటైర్మెంట్ తర్వాత సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. నచ్చిన రంగంలో రాణిస్తూ ఎంటర్ ప్రెన్యూర్స్‌గా తిరుగులేని ముద్ర వేస్తున్నారు. 60, 70, 80 వయసు ఏదైనా సరే ‘వీ ఆర్ అన్‌స్టాపబుల్’ అని చెప్పకనే చెబుతున్నారు.

మంజు జీ, 85

80 ఏళ్ల వయసులో మంజు రెస్టారెంట్ ప్రారంభించారు ఈ బామ్మ. తన పిల్లలకు అద్భుతంగా వంట చేసి వడ్డించేవారు. అలా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆమె వంటలకు ఫిదా అయ్యారు. అయితే తల్లి మనసును అర్థం చేసుకున్న పిల్లలు ఆమెకు ఇంగ్లాండ్ లో ఓ స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. దాంతో ఆమె ఆనందం మరింత రెట్టింపయ్యింది.

ప్రస్తుతం మంజు రెస్టారెంట్‌లో అనేక నోరూరించే వంటలను పరిచయం చేస్తూ ఎంతోమంది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మంజు రెస్టారెంట్ ఒక బ్రాండ్‌గా మారింది. దాల్ ధోక్లి, తేప్లా లాంటి గుజరాత్ వంటలకు ఆమె కేరాఫ్‌గా నిలుస్తున్నారు. “రెస్టారెంట్ ప్రారంభించిన తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆకలిగా ఉన్న వ్యక్తులను చూసి నేను భరించలేను. ప్రతిఒక్కరూ కడుపునిండా తినాలని నమ్ముతాను” అని అంటోంది ఈ బామ్మ. 

నిర్మలా హెగ్డే, 64

నిర్మలమ్మకు చిన్నప్పట్నుంచే వంట చేయడం అంటే చాలా ఇష్టం. కరోనా సమయంలో ఎంతోమందికి అన్నం పెట్టారు. చివరకు వంటనే వ్యాపారంగా మార్చుకుంది. మొదట ఆమె నివసించే బిల్డింగ్ సెక్యూరిటీ గార్డులకు వంట చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నిర్మల హోమ్ ఫుడ్ వెంచర్‌ను ప్రారంభించారు. రెండు రోజుల్లోనే రూ.8 వేలు సంపాదించారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వంటలు చేయడం ఆమె ప్రత్యేకత. ఈమె వండే వంటల్లో అప్పం, వెల్లుల్లి పచ్చడి బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందాయి. చింతపండు అన్నం, టొమాటో రైస్, లెమన్ రైస్, కుర్మా లాంటివి అద్భుతంగా చేస్తోంది. 

నాగమణి, 88

ఈమె బెంగుళూరు నివాసి, అందరు ‘మణి ఆంటీ’ అని పిలుస్తారు. 24 ఏళ్ల వయసులోనే జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంది. మైసూర్‌కు చెందిన స్నేహితురాలితో హెయిర్ ఆయిల్ ఫార్ములాను కనుగొన్నారు. కొబ్బరినూనెతో ఆర్గానిక్ ఆయిల్ ప్రొడక్ట్స్‌ను తయారుచేశారు. వనమూలికలతో తయారుచేయడంతో మంచి ఫలితాలొచ్చాయి. దీంతో మణి అంటీ ఫార్ములా వ్యాపారంగా మారింది. 300 మిల్లీలీటర్ల నూనెతో కూడిన బాటిల్‌ను రూ.600 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ‘ఫ్రెష్ ఎర్త్ ఆర్గానిక్స్’ పేరుతో ఆన్‌లైన్ బిజినెస్ కూడా చేస్తున్నారు.

సంతోషిణి మిశ్రా, 74

“నేను బాగా వంట చేస్తా. ఇతర పనుల్లో బిజీగా ఉన్నా సరే వంట చేయడం మానుకోను. అందుకే ఏమాత్రం సమయం దొరికినా వంటింట్లో దూరిపోతాను. గత 40 సంవత్సరాలుగా వంట చేస్తున్నా“ అని అంటారు ఒడిశాకు చెందిన 74 ఏళ్ల సంతోషిణి మిశ్రా. మహిళలు ఇంటి బయట పనిచేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్న కాలంలోనూ పనిచేశారు. కుటుంబ బాధ్యతల కోసం ఇతరుల ఇళ్లలో వంట చేసింది.

ఆ తర్వాత వంటనే వ్యాపారసూత్రంగా మలుచుకున్నారు. ప్రస్తుతం సంతోషిని బృందంలో దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా, మష్రూమ్ మసాలా, వెజ్ బిరియానీ, చికెన్ బిరియానీ మొదలైన శాఖాహారం లాంటి వంటకాలను బాగా చేస్తారు. 

కోకిలా పరేఖ్, 79

కొందరు వయస్సుతో సంబంధం లేకుండా బిజినెస్ చేస్తూ సక్సెస్‌ను అందుకుంటారు. అలాంటివారిలో కోకిలా పరేఖ్ ఒకరు. ముంబైకి చెందిన కోకిలా పరేఖ్ 79వ ఏట టీ మసాలా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంట్లో కోకిలా తయారు చేసే రుచికరమైన టీని ప్రశంసిస్తూ స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు. ఈ మసాలా టీ రెసిపీ కోకిలకు ఆమె తల్లి వారసత్వంగా అందించారు.

2020లో.. లా క్డౌన్ సమయంలో తన ఫ్యామిలీ రెసిపీతో వ్యాపారంలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. తల్లి ఆలోచనకు కుటుంబసభ్యులు అండగా నిలిచారు. కోకిలా కుమారుడు తుషార్ టీ మాసాల తయారీకి కావాల్సిన సుగంధ ద్రవ్యాల కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. వ్యాపారానికి కేటీ (కోకిలా తుషార్) చాయ్ మసాలా అని పేరు పెట్టారు. ఈ టీ రోజుకు 500 వందలకు పైగా ఆర్డర్లను అందుకుంటున్నారు.