calender_icon.png 23 October, 2024 | 3:40 AM

బల్దియాలో ఎంటమాలజీ లీలలు!

23-10-2024 01:04:14 AM

  1. అధికారులు, ఏజెన్సీల కుమ్మక్కు 
  2. ప్రధాన కార్యాలయంలో ఆపరేటర్ కేంద్రంగా సాగుతున్న వ్యవహారం 
  3. విధులకు డుమ్మా కొట్టినవారికి అటెండెన్స్ వేసి జీతాలు నొక్కుతున్న వైనం 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బల్దియాలో ఎంటమాలజీ విభాగం లీలలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్న, మొన్నటి దాకా ఫాగింగ్ చేయకున్నా.. బిల్లులు నొక్కేస్తున్నట్టుగా విమర్శలు రాగా, ప్రస్తుతం విధులకు హాజరు కాని సిబ్బందికి ఫుల్ అటెండెన్స్ వేస్తూ వారి జీతాలను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నట్టుగా ప్రధాన అధికారులపైనే ఆరోపణ లు వస్తున్నాయి.

సదరు ఏజెన్సీతో కుమ్మక్కు అయిన అధికారులు ఈ తరహా దోపిడీకి పాల్పడుతుండగా, ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్ కీ రోల్ పోషిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.

ఓ మహిళా ఉద్యోగిని ఆరోగ్య కారణాల రీత్యా సెలవు పెట్టి వైద్యం చేయించుకొని ఆ తర్వాత ఈఎస్‌ఐ ద్వారా బిల్లులు పొందాలని భావించగా, ఎంటమాలజీ విభాగంలో కొనసాగుతున్న ఈ తరహా దందా గుట్టు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. 

జీతాలు కొట్టేస్తున్న తీరు ఇదీ.. 

జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో సర్కిల్, జోన్ స్థాయిలో అనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రులలో చేరుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వారిపై అధికారులకు సాధారణంగానే లీవ్ లెటర్ పెడుతుంటారు. దీంతో సర్కిల్, జోనల్ స్థాయిలో సంబంధిత అధికారులు లీవ్ పెట్టిన వారికి ఆబ్సెంట్ వేస్తుండగా.. ఈ లెటర్లన్నీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే వాటిని చెత్త బుట్టలో పడేసి వాళ్లందరికీ ఫుల్ అటెండెన్స్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఆ తర్వాత నెల నెలా జీతాలు వేసే సమయంలో క్షేత్రస్థాయిలో ఆబ్సెంట్ అయిన సిబ్బందికి అటెండెన్స్ వేసి వారి జీతాలను సదరు ఏజెన్సీ ఖాతాలో జమ చేస్తుంటారు. అనంతరం క్షేత్రస్థాయి అటెండెన్స్ రిజిస్టర్‌లో హాజరు నమోదు ప్రకారమే వారికి జీతాలు చెల్లిస్తూ మిగతా సొమ్మును సదరు ఏజెన్సీ, అధికారులు కుమ్మక్కై దోచుకుంటుండం విశేషం.

అయితే, ఈ సొమ్ము ఒక రోజు, రెండ్రోజులది కాదు సుమీ.. ఏకంగా  నెలల తరబడి సెలవుపై వెళ్తున్న వారి జీతాలను గుట్టుచప్పుడు కాకుండా పొందుతున్నట్టుగా తెలు స్తోంది. వీరిలో కరోనా టైంలో, ప్రసూతి సెలవులపై వెళ్లిన వారికి కూడా అటెండెన్స్ వేసి వారి జీతాలను జేబుల్లోకి నెట్టేసుకున్నారు.

బల్దియాలో గత నాలుగేళ్లుగా సాగు తున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు వాటా లు అందుతున్న కారణంగానే ఎలాం టి చర్యలు ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వీటిలో 2021లో నవంబర్ నెల లో ప్రమాదానికి గురై దాదాపు రెండు నెలలు సెలవులో ఉన్న అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ (ఏఈ) పేరుతో బల్దియా నుంచి జీతం డ్రా అయినట్టుగా తెలుస్తోంది. అదే ఏడాదిలో మూడు నెలలు సెలవుపై వెళ్లిన మరో ఏఈ జీతాలు కూడా అధికారులు నొక్కేశారు. 

వెలుగులోకి ఇలా..

గత నాలుగేళ్లుగా ఉద్యోగుల వేతనాలను అక్రమంగా దోచుకుంటున్న వారి తీరు వెలుగులోకి రావడం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ మహిళా ఉద్యోగిని ఈఎస్‌ఐ సదుపాయాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఆ సమయంలో ఫుల్ అటెండెన్స్ ఉండటంతో సదరు ఉద్యోగిని తనకు రావాల్సిన ఈఎస్‌ఐ సదుపాయాలను కోల్పోవాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని ప్రస్తావించిన సదరు ఉద్యోగినిని ఉన్నతాధి కారులు బెదిరింపులకు గురిచేసినట్టుగా తెలుస్తోంది. ఈ బాగోతం ఎంటమా లజీ విభాగం అధిపతి కనుసన్నల్లోనే నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఎంటమాలజీ విభాగంలోని ఉద్యోగుల జీతాల విషయంలో కాంట్రాక్టర్‌కు చెల్లించిన సొమ్ములు, కాంట్రాక్టర్ నుంచి ఉద్యోగులకు చెల్లించిన వివరాలు బయటకు వస్తే అసలు గుట్టురట్టు బయటపడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంపై నూతన కమిషనర్ దృష్టిని కేంద్రీకరించి బల్దియా సొమ్మును స్వాహా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.