calender_icon.png 30 September, 2024 | 10:54 PM

సమరోత్సాహం

19-09-2024 12:05:43 AM

నేటి నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు 

విజయమే లక్ష్యంగా బరిలో రోహిత్ సేన 

చెన్నై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సమాయత్తమవుతోంది. నేటి నుంచి చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. హోంగ్రౌండ్‌లో సిరీస్ జరుగుతుండడతో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇటీవలే పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపైనే 2 వైట్‌వాష్ చేసిన బంగ్లాదేశ్..

భారత్‌తో సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023- 25)లో భాగంగా పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు మరో 10 టెస్టులు ఆడనుంది. బంగ్లాతో సిరీస్ అనంతరం న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. గత పదేళ్ల కాలంలో స్వదేశంలో టెస్టుల్లో భారత్ గెలుపోటముల సంఖ్య (40-4)గా ఉండడం విశేషం. 

పేపర్‌పై బలంగా..

గతానికి భిన్నంగా ఈసారి చెన్నై పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండ డంతో తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది. రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, జడేజా, అశ్విన్‌లతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తోంది. టెస్టుల్లో కోహ్లీకి స్వదేశంలో మంచి రికార్డు ఉంది. అయితే 2021 నుంచి 15 టెస్టులు ఆడిన కోహ్లీ 30 యావరేజ్‌తో పరుగులు సాధించాడు. 2017లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన అనంతరం రోహిత్ శర్మ టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.

అతనికి తోడుగా గిల్, జైస్వాల్, రాహుల్, పంత్‌లు మంచి బ్యాటింగ్ యావరేజ్ కలిగి ఉన్నారు. లోయర్ ఆర్డర్‌లో జడేజా కీలకమయ్యే అవకాశముంది. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజా స్థానా లు ఖాయం కాగా.. మరో స్థానం కోసం ఆకాశ్ దీప్, యష్ దయాల్, కుల్దీప్ యాదవ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బ్యాటింగ్ పటిష్టం కావాలనుకుంటే అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. ఇక గంభీర్‌కు కోచ్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్. లంక పర్యటనలో టీ20 సిరీస్‌ను నెగ్గిన భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అసలు ‘టెస్టు’ పరీక్ష బంగ్లాతో మొదలుకానుంది.

ఉదయం 9.30 నుంచి

జట్టు అంచనా

రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/యష్ దయాల్/ఆకాశ్ దీప్.