వరంగల్ లేదా మానుకోటలో ఏర్పాటు చేయండి
ఐటీ, ఫార్మా ఎగుమతులకు ప్రోత్సాహం అవసరం
సోనా మసూరి బియ్యానికి జీఐ ట్యాగ్ ఇవ్వాలి
కేంద్రాన్ని కోరిన ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ముంబైలో జాతీయ వాణిజ్య మండలి భేటీకి హాజరు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వచ్చే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ల డాలర్ల (రూ.84 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని, ఆయన సంకల్పానికి కేంద్రం మద్దతుగా నిలవాలని రాష్ర్ట ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శుక్రవారం ముంబైలో జరిగిన జాతీయ వాణిజ్య మండలి సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన హాజరయ్యారు.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, లక్ష్యాలను శ్రీధర్‌బాబు వివరించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల వాణిజ్య శాఖల మంత్రులు పాల్గొని వాణిజ్య విధానాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాలకు సాయమందించేందుకు ఎగుమతి, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ పునరుజ్జీవన పథకాలను కేంద్రం తీసుకొచ్చిందని, అయితే నిధుల కొరత వల్ల ఈ పథకాలు అనుకున్న విధంగా రాష్ట్రాలకు ఉపయోగపడటం లేదని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్
తెలంగాణ అవసరాలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి రాష్ట్రానికి తోడ్పాటునందించాలని కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి పసుపు పొడి, సహజ రంగులను ఉత్పత్తి చేస్తే ఎగుమతులకు వీలు కలుగుతుందని చెప్పారు. దీనివల్ల పసుపు రైతుల శ్రమకు తగిన ఆదాయం వస్తుందని అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మిర్చిని త్వరితగతిన ఎండబెట్టే ప్లాంటును ఏర్పాటు చేస్తే నాణ్యత పెరిగి ఎగుమతులకు గిరాకీ పెరుగుతుందని వివరించారు.
నిజామాబాద్ లేదా వరంగల్‌లో సుగంధ ద్రవ్యాల ప్రయోగశాలను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్లు జారీచేస్తే బాగుంటుందని సూచించారు. దీనివల్ల కస్టమ్స్ క్లియరెన్సు తేలికగా లభిస్తుందని పేర్కొన్నారు. పండ్లు, కూరగాయల నిల్వ సమయం పెంచేందుకు శుద్ధి ప్లాంటు అవసరముందని, దీనికి తగిన నిధులు విడుదల చేసి ఆహార వ్యర్థాన్ని నివారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు
త్వరగా పాడయ్యే పాలు, గుడ్లు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు వీలుగా శీతల రవాణా, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలను కల్పించాలని కేంద్రాన్ని శ్రీధర్‌బాబు కోరారు. సోనామసూరీ బియ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగింగ్‌ను ఇవ్వాలని విన్నవించారు. పారిశ్రామిక వాడల సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, కరీంనగర్, వరంగల్‌లో గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు, వాక్సిన్ టెస్టింగ్ లేబోరేటరీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమల అవసరాలకు ముడి సరుకు సేకరణ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
కేంద్రం సహకరిస్తే ఉపాధికి ఊతం
ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లు, కెమికల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రాష్ర్ట ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని నొక్కి చెప్పారు. రాష్ర్టంలో వస్త్రాలు, ప్లాస్టిక్ల్, పాలిమర్లు, వైద్య పరికరాల ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తే ఈ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. దీనికి తోడు రత్నాలు, బంగారు ఆభరణాలు, బొమ్మలు, ఫర్నిచర్, హస్తకళల ఎగుమతులను ప్రోత్సహించాలని కోరారు.