calender_icon.png 15 January, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి హక్కులకు భరోసా

22-12-2024 12:56:26 AM

-ఐ.వి.మురళీకృష్ణ శర్మ

మార్పు అనేది మంచి కోసమైతే సమాజం ఎప్పుడూ స్వాగతిస్తుంది. పాలకులు చొరవ తీసుకొని సామా న్యుల సంక్షేమం కోసం ప్రక్షాళన చేపడితే ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తారు. తెలంగాణ భూవ్యవస్థ పరిపాలనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పలు మార్పులు, చేర్పులతో కొత్త చట్టం తీసుకొచ్చింది.

రాష్ట్రంలో భూ వ్యవహారాల కోసం  రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ‘భూభారతి ఆర్‌ఓఆర్ 2024’ బిల్లుతో రాష్ట్రంలో నవశకం ప్రారంభమవుతుందని రైతులు, భూ యజమానులు, పేద ప్రజలు ఆశిస్తున్నారు.దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను ‘భూభారతి’ పరిష్కరిస్తుందనే భరోసాతో తెలంగాణ ప్రజలున్నారు.

నేటి కాలమాన పరిస్థితుల్లో భూమి చాల కీలకాంశంగా మారింది. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఆయా రాజ్యాల భూములపైనే ఆధారపడి ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇటు ప్రభుత్వాలకు, అటు ప్రజలకు భూ వ్యవహారాలు ముఖ్యాంశాలుగా మారుతున్నాయి.

భూములకు సంబంధించి ప్రభుత్వాలు మార్పులు, చేర్పులు చేపడుతున్న సమయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతా యో అనే ఆందోళనతో లబ్ధ్దిదారుల గుండె ల్లో రైళ్లు పరిగెత్తడం సర్వసాధారణమయ్యిం ది. పాలకులు చేసే నిర్ణయాలు ప్రజామోదంగా ఉండాలి.  అన్నివర్గాల వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. భూములకు సంబంధించి ఇప్పటికే మార్పులు, చేర్పులతో పలు చట్టాలు వచ్చినా ప్రజలకు ప్రధానంగా పేదలకు ఆశించిన ఫలితాలు రాలేదు.

 ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం 2020లో తెచ్చిన ధరణి చట్టంలోని లోపాలను సరిదిద్దుతూ, గత 10 నెలలుగా రాష్ట్రంలోని అన్నివర్గాలతో కూలంకషంగా చర్చించడమే కాకుండా, దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను కూడా అధ్యయనం చేసి   ‘భూ భారతి’ బిల్లును ప్రవేశపెట్టింది.

బిల్లు డ్రాఫ్ట్‌ను 2024 ఆగస్టులో రూపొందించి అన్ని వర్గాల నుండి దాదాపు నెల రోజులపాటు సూచనలు, అభ్యంతరాలు స్వీకరించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక సదస్సులు నిర్వహించి ‘భూభారతి’ చట్టం ఉద్దేశ్యాలు, లక్ష్యాలను రైతులకు, రైతు సంఘాల ప్రతినిధులకు కలెక్టర్లు, అధికారులు వివరించి అవగాహన కల్పించారు. .

ప్రతి భూమికీ గుర్తింపు కార్డు

తెలంగాణ భూభారతి- 2024 చట్టంలో ముఖ్యాంశాల్ని పరిశీలిస్తే... ఆధార్‌లాగే ప్రతి భూకమతానికి ప్రత్యేక సంఖ్యతో ‘భూదార్’ ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన అంశం. దీంతో ప్రతి భూమికి ఒక గుర్తింపు కార్డు వస్తుంది. భూములకు సంబంధించి ప్రతి విషయానికి జిల్లాకు, హైదరాబాద్‌కు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలో నే రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండడంతో పేదలకు వ్యయప్రయాసలు తప్పుతా యి.

భూ సమస్యలపై కోర్టులకు తిరగకుండా ఉండేందుకు ముందుగా జిల్లా స్థాయిలో ఆర్డీవో, కలెక్టర్ వద్దనే సమస్యలను పరిష్కరించుకునేందుకు అప్పీలు వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక భూ పరిపాలన ట్రిబ్యునళ్ల ఏర్పాటు కూడా ఈ చట్టంలో ఉంది.  ఇన్ని వ్యవస్థలు ఉండడంతో బాధితులకు ఎక్కడో చోట న్యాయం జరిగే అవకాశా లు ఉంటాయి. అంతేకాక, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం ఒక వరమే.

ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, సీలింగ్, కాందిశీకుల భూములపై అక్రమంగా పొందిన పాస్‌బుక్కులను రద్దుచేసే అధికారాన్ని ఈ చట్టం సీసీఎల్‌ఏ కట్ట బెట్టింది. అంతేకాకుండా అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలను 3 నెలల్లోనే వేగవంతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు.

సాదాబైనామాల క్రమబద్ధీరణకు సంబంధించి ఆన్‌లైన్‌లో తీసుకొని, అపరిష్కృతంగా ఉన్న దాదాపు 9 లక్షల సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి ‘భారతి’లో 2014 జూన్ 2 కటాఫ్ తేదీతో చివరి అవకాశం  కల్పించారు.  భూముల మ్యుటేషన్‌కు సంబంధించి భూభారతి’ చట్టంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

సరైన విచారణ జరిపి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే వారసత్వంగా అటోమేటిక్‌గా,మ్యుటేషన్‌కు అవకాశం కల్పించారు. భూములపై వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా మ్యుటేషన్‌తో పాటుగా మ్యాప్‌ను జతచేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. అంతేకాక డిజిటల్ ల్యాండ్ రికార్డులను సవరించే వెసులుబాటు ఇందులో ఉంది.

పార్ట్‌బి కేసులపై నిర్ణయించే అవకాశాలు కూడా చట్టంలో ఉన్నాయి. భూభారతి చట్టంలో గ్రామ కంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డును కల్పించడంతో ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులేని గ్రామ కంఠం భూములకు పట్టా పాస్‌పుస్తకాలు జారీ చేయవచ్చు. 2014కు ముందున్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే, వాటిని గుర్తించి కారకులపై కఠిన చర్యలు తీసుకొనే నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. 

అప్పీలుకు అవకాశం లేని ‘ధరణి’

అన్ని వర్గాలతో చర్చించి, సుదీర్ఘ అధ్యయనం అనంతరం రూపొందించిన  ‘భూ భారతి’ చట్టానికి, ఇప్పటివరకు అమలులో ఉన్న ధరణి’ చట్టం మధ్య వ్యత్యాసాలున్నా యి. బాధితుల అప్పీలుకు ధరణిలో అవకాశం లేదు. ఇప్పుడు భూభారతిలో ఉంది. తప్పులు సవరించే అవకాశం ధరణిలో లేదు, ఇప్పుడు కల్పించారు. రిజిస్ట్రేషన్ నిలిపివేత అంశం ఇప్పుడు ఉంది. అప్పుడు లేదు. మ్యు టేషన్ విచారణ అప్పుడు లేదు. ఇప్పుడు ఉం ది. ధరణి పోర్టల్‌లో భూ దస్త్రాలన్నీ కనిపించేవి కావు. ఇప్పుడు భూభారతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూములను క్షుణ్ణంగా పరిశీలించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.

కీలక బాధ్యులుగా అధికారులు

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో ప్రభుత్వాధికారులను కూడా కీలక బాధ్యులుగా చేశారు. అక్రమాలు, రికార్డుల తారుమారు అంశాలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా చేసే అధికారులకు శిక్షపడే అవకాశాలు ధరణిలో లేదు. ఇప్పుడు కఠిన శిక్షలు ఏర్పాటు చేశారు. పహాణీలో భూమి వివరాలను అప్పుడు పొందుపర్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వివరాలుంటాయి.

గ్రామ కంఠం భూములకు రికార్డులు అప్ప డు లేవు. ఇప్పుడు రికార్డులుంటాయి. సాదాబైనామాల దరఖాస్తుల క్రమబద్దీకరణకు ధరణి చట్టంలో అవకాశం లేదు. అయితే ఇప్పుడు అవకాశం కల్పించారు. గ్రామ భూ ఖాతాల నిర్వహణ అంశం ధరణిలో లేదు. ఇప్పుడు ఉంది. ధరణి చట్టంలో 33 మాడ్యూళ్లు ఉండడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. కొన్ని దరఖాస్తులు సాంకే తికంగా తిరస్కరణకు గురవడంతో దరఖాస్తుదారులకు అదనపు భారం పడేది. ఇప్పుడు భూభారతిని 6 మాడ్యూళ్లకే పరిమితం చేయడంతో వెసులుబాటు కలిగింది.

నూతన చట్టంతో సంబంధిత భూ యజమాని ఫోన్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా  సమాచారం పంపే అవకాశం ఉంది. వారు తమ దరఖాస్తులను ట్రాకింగ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. భూ భారతిలో భూ రికార్డులను అక్రమంగా ట్యాంపరింగ్ చేయకుండా ఉండే నూతన వ్యవస్థ ఉంది. ఇటువంటి సానుకూల చర్యలతో భూ యజమానులకు భద్రతతో పాటు హక్కులు కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి.

భూ భారతి తెలంగాణకు కొత్తేమి కాదు. 2004లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించగా నిజామాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద సర్వే చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతిపక్ష నేతలు హరీశ్‌రావు, వినోద్‌కుమార్ చేసిన సూచనలను కూడా బిల్లులో పొందుపర్చామని చెప్పడం స్వాగతించాల్సిన అంశం.

ధరణి చట్టంతో రాష్ట్రంలో దాదాపు 25 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అక్రమార్కులు లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టారనే ఆరోపణలున్న నేపథ్యంలో కొత్తగా తీసుకొచ్చిన ‘భూ భారతి’ చట్టం ప్రజల్లో సానుకూల భరోసా నింపుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశిద్దాం.